అక్రమ నిర్మాణాల కూల్చివేత..ఆందోళనకు దిగిన బాధితులు

ప్రభుత్వ స్థలంలో, నిబంధనలకు విరుద్దంగా చేపట్టిన ఇండ్లు నిర్మాణాలను

Update: 2024-10-05 11:56 GMT

దిశ, ఉట్నూర్ : ప్రభుత్వ స్థలంలో, నిబంధనలకు విరుద్దంగా చేపట్టిన ఇండ్లు నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో వాగును ఆక్రమించుకుని నాందేవ్ అనే వ్యక్తి ఇల్లు నిర్మాణం చేపట్టగా, ఎలాంటి అనుమతి లేని మరో నూతన ఇంటిని సైతం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున బుల్డోజర్ తో సబ్ కలెక్టర్ యువరాజ్ సమక్షంలో కూల్చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టడం జరిగిందని, అనుమతి లేకుండా మరో నిర్మాణాలను చేపట్టినప్పటికి వీటిని పరిశీలించి నోటీసులు జారీ చేశామని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినందున కూల్చివేశామని పంచాయతీ అధికారులు పేర్కొన్నారు.

కూల్చివేతకు నిరసనగా బాధిత కుటుంబ సభ్యులు ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఆదిలాబాద్- మంచిర్యాల వెళ్లే రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఆందోళనలో పట్టణ ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఆందోళన రెండు గంటల పాటు సాగింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికులతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిర్మాణ పనులు కూల్చివేతపై పలు వ్యాపారస్థుల దుకాణాలను మూసివేసి ఆందోళనలో పాల్గొన్నారు. ఇంటి నిర్మాణంలో ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మాణం చేపట్టినప్పటికీ కూల్చివేత తగదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడాన్ని బాదితులు, ప్రజలు వ్యతిరేకించారు. ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, సీఐ మొగిలి సంఘటన స్థలానికి చేరుకొని బాదితులు, ప్రజలతో మాట్లాడారు. ధర్నాను విరమించాలని సూచించారు.

ఉట్నూర్ సబ్ కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని అప్పటి వరకు ధర్నాను విరమించేది లేదని బిస్మించుకుర్చున్నారు. ఆందోళనతో ప్రజలతో పాటు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఉండాలని, అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో దశాబ్దాల కాలంలో గిరిజనుల పాటుగా గిరిజనేతులు సైతం నివాసం ఉంటున్నప్పటికి గిరిజనేతరుల ఇండ్లను కూల్చివేయడాన్ని తమపై కక్ష్య సాధింపు చర్యలేనని గిరిజనేతరులు వాపోయారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సబ్ కలెక్టర్ యువరాజ్ ఇంద్రవెల్లిలోని పంచాయతీ కార్యాలయ అవరణలోకి చేరుకోవడంతో కూల్చివేతపై బాధితులు, ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకుని కట్టడాలు చేస్తే ఊరుకోమని, ఎలాంటి వారైనా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, గిరిజనేతరులు పాల్గొన్నారు.


Similar News