సౌదీ ఎడారి నుంచి క్షేమంగా స్వదేశానికి చేరిన జిల్లా వాసి

కువైట్-సౌదీ అరేబియాలోని సరిహద్దుల్లో ఎడారి ప్రాంతంలో ఒంటెల కాపరిగా పని చేస్తూ నానా కష్టాలు అనుభవించిన నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రూవి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ ఎట్టకేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఇటీవల స్వదేశానికి చేరుకున్నారు.

Update: 2024-10-05 15:28 GMT

దిశ, భైంసా: కువైట్-సౌదీ అరేబియాలోని సరిహద్దుల్లో ఎడారి ప్రాంతంలో ఒంటెల కాపరిగా పని చేస్తూ నానా కష్టాలు అనుభవించిన నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రూవి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ జీఏడి ఎన్నారై శాఖ అధికారులు,మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ తో కలిసి కువైట్,సౌదీ అరేబియా రెండు దేశాల్లోని ఇండియన్ ఎంబసీలతో, అక్కడి సామాజిక సేవకులతో ఢిల్లీలోని విదేశాంగ శాఖతో సమన్వయం చేసి నాందేవ్ ని రక్షించి స్వదేశానికి వచ్చేలా కృషి చేశారు. ఈ సందర్భంగా శనివారం ఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకులు మంద భీమ్ రెడ్డి,శ్రీనివాసరావు, స్వదేశ్ పరిక పండ్ల, నంగి దేవేందర్‌తో పాటు గల్ఫ్ బాధితుడు రాథోడ్ నాందేవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.


Similar News