ప్రభుత్వ నిబంధనల మేరకు వరి ధాన్యం కొనుగోలు

ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ అన్నారు.

Update: 2024-03-11 17:24 GMT

దిశ, మంచిర్యాల టౌన్: ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్‌లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని అదనపు కలెక్టర్ చాంబర్లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వాజిద్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గోపాల్‌తో కలిసి పౌర సరఫరాలు, బ్యాంకింగ్, రవాణా, కార్మిక, తూనికలు-కొలతలు శాఖల అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో ధాన్యం కొనుగోలు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో రైతులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం తీసుకు వచ్చే సమయంలో పాడయిన, రంగుమారిన, తేమ శాతం, మట్టి గడ్డలు ఇతరత్రా నిబంధనలను పరిశీలించుకోవాలని తెలిపారు. గ్రేడ్-ఎ, సాధారణ రకాలకు సంబంధించిన రా / పారాబాయిల్డ్ / సింగిల్ పారాబాయిల్డ్ ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని, కొనుగోలు అవసరమైన గన్నీ సంచులను సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు అనంతరం జిల్లాలోని రైస్ మిల్లుల సామర్థ్యానికి అనుగుణంగా లక్ష్యాలను కేటాయించడం జరుగుతుందని, లారీల ద్వారా తరలించిన ధాన్యాన్ని త్వరితగతిన దిగుమతి చేసుకుని వాహనాలను తిరిగి పంపించే విధంగా అధికారులు, రైస్ మిల్లుల యాజమాన్యాల సమన్వయంతో పని చేయాలని తెలిపారు. రైతులు దళారీ వ్యవస్థను ప్రోత్సహించ కుండ ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందే విధంగా అవగాహన కల్పించాలని, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిబంధనల మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలిపారు. . ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News