జిల్లాలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ జిల్లాలో అక్కడక్కడ కొన్ని సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.

Update: 2023-11-30 13:19 GMT

దిశ, ఆదిలాబాద్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ జిల్లాలో అక్కడక్కడ కొన్ని సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 290 పాటు బోథ్ నియోజకవర్గంలో 302 పోలింగ్ కేంద్రాలలో నిర్వహించిన ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి అంతు పట్టని విధంగా తమ తీర్పును వెలువరించినట్లు తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థులతో పాటు చిన్న పార్టీల అభ్యర్థులు మొత్తం 35 మంది పోటీలో ఉండగా, ప్రధాన పోటీ మాత్రం మూడు పార్టీల మధ్య కొనసాగినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు పోటాపోటీగా ఓటర్లు ఓట్లు వేసినట్లు సమాచారం.

అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు అంతుచిక్కకుండా ఓటర్లు ఓట్లు వేసినట్టు స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. అసలు అంచనాలకు అందకుండా ఈ ఎన్నికల్లో ఓటరు తమ తీర్పునివ్వబోతున్నట్లు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తూ.. ముందంజలో ఉంచినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తారస్థాయిలో ఉండగా ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి మాత్రం ముందుగా ఉన్నటువంటి గ్రాఫును కాపాడుకోలేకపోవడంతో ఓటర్లు ఆఖరి నిమిషంలో ఆ పార్టీని కాదని కమలం వైపు మగ్గుచూపినట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కొంత వరకు ఆదరించిన, పోటీలో మాత్రం వెనుకబడి ఉన్నట్లు వినిపిస్తోంది.

మొరాయించిన ఈవీఎంలు

జిల్లాలో గురువారం ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి . దీంతో మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం ఓటింగ్ ప్రారంభానికి పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ లైన్ ఆర్పీఎల్ ప్రభుత్వ పాఠశాలలో 210 బూతులో ఓటర్లు ఓటు వేసేందుకు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి రాగా పట్టణంలోని తాటిగూడతో పాటు మరికొన్ని కాలనీలో ఈవీఎంల మొరాయింపుతో ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారులు టెక్నీషియన్లను సంప్రదించి ఈవీఎంలకు మరమ్మతులు చేయడంతో తిరిగి ఓటింగ్ ప్రారంభమైంది. అంతకుముందు ఈవీఎంల మొరాయింపుతో వందల సంఖ్యలో ఓటర్లు ఇళ్లకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అనంతరం మధ్యాహ్నం సమయంలో వారు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

గొల్లగడు గ్రామంలో పోలింగ్ అడ్డుకున్న గ్రామస్తులు

బోథ్ నియోజకవర్గంలోని భీంపూర్ మండలంలో గల గొల్లగడ గ్రామస్తులు ఎన్నికల పోలింగ్ ను అడ్డుకున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కొత్తగా భీంపూర్ మండలం ఏర్పడిన అభివృద్ధికి మాత్రం నోచుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు అధికారులు అన్ని సిద్దం చేయగా.. ఉదయం తమ సమస్యల పరిష్కారంలో ఎటువంటి మార్పు లేదని, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా వాటి నీ పట్టించుకోలేదని, ముఖ్యంగా రోడ్డు సౌకర్యం లేక జిల్లా కేంద్రానికి వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నామని ఆరోపించారు. ఇలాంటి సందర్భంలో తాము ఓట్లు ఎందుకు వేయాలని అధికారులను ప్రశ్నించారు. గ్రామంలో రెండు గంటల పాటు ఓటింగ్ ను అడ్డుకున్న గ్రామస్తులు, తమ సమస్యల పరిష్కారానికి అధికారులు హామీ ఇచ్చిన అనంతరం తిరిగి ఓటింగ్లో పాల్గొన్నారు.

ఇకా జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పాటు భారతీయ రాష్ట్రసమితి, కాంగ్రెస్ పార్టీలు తమ ఆధిపత్యాన్ని ఎవరికి వారే కొనసాగించగా.. ప్రజలు మాత్రం ఎవరి ఊహకందనీ విధంగా తమ తీర్పును ఇచ్చినట్లు తెలుస్తోంది. గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో ప్రజాసమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు.. పథకాలలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్న ఆరోపిస్తున్న ప్రజలు.. ఈసారి కారును విస్మరించినట్లు సమాచారం. ఈ సారి బోథ్ నియోజకవర్గంలో మునిపెన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ , బీజేపీ మధ్యనే పోటీ ఉన్నట్లు వాతావరణం నెలకొంది. రెండు నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్లో బోథ్ నియోజకవర్గంలో అత్యధికంగా 75.3% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇటు ఆదిలాబాద్ నియోజకవర్గంలో సైతం 290 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన పోలింగ్లో 72.1% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇలా ఉంటే నేతల భవితవ్యం మాత్రం ఈనెల 3న జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో నిర్వహించే ఎన్నికల కౌంటింగ్ రోజున తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News