'డిజిటల్' సక్సెస్.. సర్వేలో మంచి స్పందన కనబరిచిన ప్రజలు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఎంపికైన పైలట్ గ్రామాలు, మున్సిపల్ వార్డ్‌లలో మంగళవారంతో పూర్తయింది.

Update: 2024-10-09 04:40 GMT

దిశ, భైంసా: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఎంపికైన పైలట్ గ్రామాలు, మున్సిపల్ వార్డ్‌లలో మంగళవారంతో పూర్తయింది. అక్టోబర్ 3 నుంచి 8వ తేదీ వరకు బేస్ ఫ్యామిలీ డాటా, న్యూ ఫ్యామిలీ క్రియేషన్ పేరిట డిజిటల్ సర్వే జరగగా, పైలట్ ప్రాజెక్టు కింద సర్వే జరిపినటువంటి గ్రామాలు, వార్డులలో ప్రజల నుంచి మంచి స్పందన కనబరచగా, న్యూ ఫ్యామిలీ క్రియేషన్ విధానంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి సర్వే బృందంలో ఐదుగురు సభ్యులను నియమించగా, వీరిలో అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్, పంచాయతీ కార్యదర్శి మొదలగు వాళ్ళు ఇంటింటికి వెళ్లి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించిన ప్రభుత్వం ఖరారు చేసిన రెండు ఫార్మాట్లలో సమాచార సేకరణ చేపట్టారు. కుటుంబ యజమానిగా మహిళలకు పెద్దపీట వేసి, మిగతా కుటుంబ సభ్యులకు సంబంధించిన కుటుంబ పెద్దలతో ఉన్న సంబంధం, వారి వయస్సు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు వంటి పూర్తి వివరాలు సేకరించారు. ఇప్పటిదాకా రేషన్ కార్డు సహా వివిధ పథకాలకు ప్రత్యేకంగా కార్డులు ఉండేవి. తాజాగా జారీ చేయనున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు అన్ని పథకాలకు వర్తించేలా తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పూర్తికాబడిన సర్వే తమకు పూర్తి భరోసాగా నిలుస్తుందన్న ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పూర్తయిన సర్వే

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే ఈ నెల 3 గురువారం నుండి పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గంలో ఒక మునిసిపల్ వార్డు, ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు.జిల్లాలో నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని 42 వ వార్డు చింతకుంట వాడ,నిర్మల్ మండలంలోని బ్యాంగాపూర్ గ్రామం, ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్ పట్టణంలో 4 నెంబరు మున్సిపల్ వార్డు, కొత్తపేట గ్రామం,అలాగే ముధోల్ నియోజకవర్గంలో బైంసా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 24వ వార్డును, భైంసా మండలంలోని హస్గుల్ గ్రామాల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే పూర్తి చేశారు. ముధోల్ తాలూకా సర్వే కన్వీనర్‌గా ఆర్డీవో కోమల్ రెడ్డి కొనసాగగా సర్వే కొనసాగుతున్న విధానం పై ఎప్పటికప్పుడు ఆరాతీసి, సర్వేలో సైతం పాల్గొన్నారు.

భైంసా పైలెట్ ప్రాజెక్టు వార్డులో కమిషనర్ సైతం పాల్గొని, సర్వేను పకడ్బందీగా నిర్వహించారు. భైంసా మున్సిపల్ 24 వ వార్డులో మొత్తం 433 హౌస్ హోల్డర్ల కార్డుల జాబితా పూర్తి చేయబడగా, అలాగే మండలంలోని హాస్గుల్ గ్రామంలో మొత్తం 325 హౌజ్ హోల్డర్ల కార్డుల జాబితా సర్వే పూర్తి చేయబడ్డాయి.న్యూ ఫ్యామిలీ క్రియేషన్ ఫార్మేట్ లో హాస్గుల్ గ్రామంలో 150 కార్డుల సంఖ్య పెరిగింది. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా పెళ్లి జరిగితే ఆ కుటుంబాన్ని వేరుగా గుర్తించి సర్వే చేశారు. అలాగే ఆడపిల్ల పెళ్లి జరిగి వెళ్లిపోతే ఆమె పేరును కుటుంబ సభ్యుల జాబితా నుంచి తొలగించారు.

డేటా ఎంట్రీ విధానం పై టీం లీడర్స్, ఆపరేటర్స్ కి అవగాహన, జాబితా ఎంట్రీ

సంబంధిత పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక కాబడిన జాబితా పై డేటా ఎంట్రీ కి సంబంధించి మంగళవారం ఒకొక్క పైలెట్ గ్రామానికి సంబంధించి ఇద్దరు టీం లీడర్స్,ఒక అపరెటర్స్ కి అధికారులు అవగాహన ట్రైనింగ్ నిర్వహించి, జాబితా ఎంట్రీ విధానాన్ని ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం నుండి జిల్లా కలెక్టరేట్‌లో కలెక్ట్ చేయబడిన జాబితా వివరాలు ఎంట్రీ విధానం ప్రారంభం అయింది. ఇది పూర్తి అయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం తదుపరి కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని సమాచారం. అయితే ఈ లోపు మార్పులు చేర్పులకు అవకాశం కూడా ఉంటుందని సంబంధిత అధికారుల నుండి వినికిడి.


Similar News