అన్నదాతలకు ఇన్‌పుట్ భరోసా..! ఉమ్మడి జిల్లా రైతులకు పరిహారం మంజూరు

ఇటీవల భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించేందుకు నిధులను విడుదల చేసింది.

Update: 2024-10-09 02:11 GMT

దిశ, ప్రతినిధి నిర్మల్: ఇటీవల భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించేందుకు నిధులను విడుదల చేసింది. భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన డం, పంట పొలాల్లో ఇసుకమేటలు వేయడం వంటి కారణంగా నష్టపోయిన రైతాంగానికి ఇన్‌పుట్ సబ్సిడీ కింద నష్ట పరిహారాన్ని మంజూరు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సుమారు రూ.6.5 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ పరిహారాన్ని మంజూరు చేస్తూ నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాల రైతులకు ఈ సాయం ఊరటను ఇచ్చింది. అయితే, భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలోనూ రైతులు నష్టపోయినప్పటికీ ప్రభుత్వం జిల్లా రైతాంగానికి నష్ట పరిహారం ఇవ్వకపోవడం పట్ల ఇక్కడి రైతాంగంలో కొంత నిరాశ నెలకొంది.

మూడు జిల్లాల రైతులకు భరోసా

ఇటీవల భారీ వర్షాలకు నష్టపోయిన ఉమ్మడి జిల్లా రైతాంగానికి ప్రభుత్వం భరోసానిచ్చింది. అయితే, ఆసిఫాబాద్ ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలకు మాత్రమే ఈ పరిహారం ప్రకటించింది, నిర్మల్ జిల్లాకు నష్ట పరిహారం ఇవ్వలేదు. ఆదిలాబాద్ జిల్లాలో 3,096 ఎకరాల్లో 2041 మంది రైతులు నష్టపోయినట్లుగా అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం నష్టపోయిన రైతాంగానికి రూ.3.9 కోట్లను మంజూరు చేసింది. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో 2,692 ఎకరాలకు సంబంధించి 1,371 మంది రైతులు భారీ వర్షాలతో పంటలు నష్టపోయారు. ఈ జిల్లాకు ప్రభుత్వం రూ.2.69 కోట్ల పరిహారం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మంచిర్యాల జిల్లాలో 598 ఎకరాలకు గాను 447 మంది రైతులు నష్టపోయినట్లు అంచనా వేసిన ప్రభుత్వం రూ.59.60 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించింది. ఈ మేరకు నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. విడుదలైన మొత్తాన్ని ఆయా జిల్లాల కలెక్టర్ల అకౌంట్లకు బదలాయించారు. జిల్లా రెవెన్యూ వ్యవసాయ శాఖలు సమన్వయంగా నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని అందించనున్నారు. ప్రభుత్వం వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణమే సాయం మంజూరు చేయడం పట్ల రైతాంగంలో హర్షం వ్యక్తం అవుతోంది.

నిర్మల్ రైతుల్లో నిరాశ...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మూడు జిల్లాలకు వర్షాకాలం‌లో జరిగిన నష్టాన్ని ఇన్‌పుట్ సబ్సిడీ కింద పరిహారం అందిస్తుండగా.. నిర్మల్ జిల్లా రైతాంగానికి ఇవ్వకపోవడం పట్ల ఆ జిల్లా రైతులు నిరాశతో ఉన్నారు. వాస్తవానికి నిర్మల్ జిల్లాలోనూ భారీగానే రైతులు నష్టపోయారు. జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం సైతం నష్టం అంచనాలను ప్రభుత్వానికి అందజేశారు. అయితే, ప్రభుత్వం నిర్మల్ జిల్లా రైతులకు పరిహారం ఇవ్వకపోవడంపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరోసారి సమీక్షించి నిర్మల్ జిల్లాకు నిధులు మంజూరు చేయాలని బీజేపీ శాసనసభ పక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ డిమాండ్ చేశారు.


Similar News