మంచిర్యాలలో పేపర్ లీక్ అవాస్తవం
జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయని, సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్టు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

దిశ,మంచిర్యాల : జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయని, సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్టు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్బీహెచ్వీ, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య, తహసీల్దార్ రఫతుల్లాలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.
తాగునీరు, విద్యుత్ సరఫరా, ఆర్టీసీ బస్సులు, ప్రశ్నా, జవాబు పత్రాల రవాణా, బందోబస్తు, పారిశుద్ధ్యం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచినట్టు చెప్పారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకు 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొదటి రోజు 9 వేల 183 మంది హాజరు కావాల్సి ఉండగా 9 వేల 163 మంది హాజరయ్యారని తెలిపారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలు
మొదటి రోజున జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష 2 గంటల ఆలస్యంగా ప్రారంభమైందని కలెక్టర్ దీపక్ కుమార్ తెలిపారు. రోజు వారీగా, ప్రశ్నాపత్రాల సెట్ల వారీగా పోలీస్ స్టేషన్ నుండి ప్రశ్నాపత్రాలను బందోబస్తు మధ్య ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని పరీక్షా కేంద్రాలకు తరలించడం జరుగుతుందని చెప్పారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ నుండి స్టేషన్ పరిధిలోని పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు తరలించే క్రమంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రం-03015 కు తరలించే ట్రంక్ బాక్సులో రెండవ రోజు పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఉన్నాయని గమనించినట్టు చెప్పారు. పరీక్షా కేంద్రానికి రావలసిన ప్రశ్నాపత్రాల బాక్సులను వెతకడంతో గంటన్నర సమయం పట్టిందని అన్నారు.
అయితే ఉన్నతాధికారుల అనుమతి పొంది విద్యార్థులకు ప్రశ్నాపత్రాలను 2 గంటల ఆలస్యంగా ఇచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. 2 గంటలు ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైనందున విద్యార్థులకు స్నాక్స్ అందించినట్టు చెప్పారు. ట్రంక్ బాక్సుల్లో గుర్తించిన రెండవ రోజు పరీక్ష ప్రశ్నాపత్రాలను తెరవలేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, పేపర్ లీక్ అయిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. విధులలో నిర్లక్ష్యం వహించిన పరీక్షా కేంద్రం ముఖ్య పర్యవేక్షకులు మీర్ సప్టర్ అలీఖాన్, శాఖ అధికారి ఎన్.ఆర్. పద్మజ లను సస్పెండ్ చేయడం జరిగిందని, ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మొదటి రోజు 99.74 శాతం హాజరు నమోదు కావడం జరిగిందన్నారు.