ఖజీపుర కాలనీ పై కనికరం లేదా

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని రెండవ వార్డు పరిధిలో గల ఖజీపుర కాలనీలో ఒకవైపు చెత్తాచెదారం మరోవైపు మురుగునీటి దుర్వాస వెదజల్లడంతో కాలనీవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

Update: 2024-12-18 10:13 GMT

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని రెండవ వార్డు పరిధిలో గల ఖజీపుర కాలనీలో ఒకవైపు చెత్తాచెదారం మరోవైపు మురుగునీటి దుర్వాస వెదజల్లడంతో కాలనీవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ స్థానిక నాయకులు పట్టించుకోవడం లేదని కాలనీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని మేజర్ గ్రామపంచాయతిని మున్సిపాలిటీగా మార్చినప్పటికీ తమకు ట్యాక్స్ లు పెరగడం తప్ప ఒరిగిందేమీ లేదని కాలనీ ప్రజలు విమర్శిస్తున్నారు. ఖజీపుర దళితవాడకు ఆనుకొని ఉండడం వల్ల తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని, పట్టణానికి చివరగా ఉండడం వల్ల పట్టణంలోని సగం మురుగునీరు ఇదే నాలాల గుండా మురుగుకుంటలోకి వెళ్తాయని, నాలాలు శిథిలావస్థకు చేరడంతో మురుగునీరు రోడ్లపైనే పారుతుందని, అదే దారి మీదుగా తాము నడవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

    అధికారులకు, నాయకులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, అపరిశుభ్రతతో కాలనీవాసులు రోగాల బారిన పడినప్పటికీ అధికారుల్లో, నాయకులలో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేసి గద్దెనెక్కి ఎన్నికల తర్వాత నుండి తమను పట్టించుకునే నాయకుడే లేడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి తమ కాలనీలో పరిశుభ్రత పాటించి తమను రోగాల బారి నుండి కాపాడాలని కాలనీవాసులు కోరుతున్నారు. లేనిపక్షంలో రాబోయే స్థానిక ఎన్నికలలో నాయకులకు తగిన గుణపాఠం చెపుతామని కాలనీ ప్రజలు హెచ్చరిస్తున్నారు. 


Similar News