మిషన్ భగీరథ నీటితో హానిలేదు
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ నీరు ప్రతి గ్రామానికి అందుబాటులో ఉందని, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఈ నీటిని సురక్షితంగా తాగవచ్చని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

దిశ, ఆదిలాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ నీరు ప్రతి గ్రామానికి అందుబాటులో ఉందని, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఈ నీటిని సురక్షితంగా తాగవచ్చని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తమ గ్రామాల్లో నీటి సమస్య ఉందని ప్రజల నుంచి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు గురువారం ఆయన స్పందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ రూరల్, నార్నూర్ మండలాల్లోని ఖండాల, గ్రామస్తులు, సుంగాపూర్ గోండు గూడ, లంబాడితండా , కొలాంగుడ గ్రామాలను అధికారులు నీటి సమస్యపై సందర్శించనున్నట్టు చెప్పారు.
సుంగాపూర్ గోండు గూడ గ్రామంలో సుమారు 70 కుటుంబాలు, కొలంగూడ గ్రామంలో సుమారు 48 కుటుంబాలు, లంబాడి తండా గ్రామంలో సుమారు 112 కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. ఈ గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు వస్తుందని, కానీ గ్రామస్తులు వాటిని తాగడానికి నిరాకరించడంతో ఎక్కడో దూరంలో ఉన్న చేతి పంపు, బావుల నుండి నీరు తెచ్చుకుంటున్నారని తెలిపారు. గ్రామస్తులు మిషన్ భగీరథ నీరు తాగడం వల్ల ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని తెలిపారు. అదే విధంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల బావులు, చేతి పంపులలో నీరు ఇంకిపోతే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తామని అన్నారు.