నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. అన్నీ తానై చూసుకుంటున్న మంత్రి అల్లోల
నిర్మల్ జిల్లాకు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.
దిశ ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాకు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. సీఎం పర్యటన ఆద్యంతం ఎక్కడా సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. సీఎం పర్యటన ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్నందున ఏర్పాట్ల విషయంలో ఎక్కడా తక్కువ కాకుండా చూడాల్సిన బాధ్యతలను సంబంధిత వర్గాలకు అప్ప చెబుతూ రోజంతా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బిజీ బిజీగా గడిపారు.
కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి..
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో కీలకమైన కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డి సహా జిల్లా ఉన్నత స్థాయి అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తర్వాత ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టర్ కార్యాలయంలోనే అధికారులతో మాట్లాడారు. కలెక్టర్ భవన ప్రారంభోత్సవం విషయంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని కలెక్టర్ వరుణ్ రెడ్డి ఎస్పీ ప్రవీణ్ కుమార్లను మంత్రి ఆదేశించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఉండాల్సిన అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులను ఆహ్వానించే విషయంలో పలు సూచనలు చేశారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శనివారం సాయంత్రానికి అలంకరణ ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ మంత్రికి తెలిపారు. దీనిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.
జనం తరలింపుపై సమాలోచనలు..
ఇక కలెక్టరేట్ ప్రారంభోత్సవం తర్వాత సాయంత్రం జరగనున్న భారీ బహిరంగ సభ పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ముథోల్ శాసనసభ్యుడు విఠల్ రెడ్డి, ఖానాపూర్ శాసనసభ్యురాలు రేఖ నాయక్ సహా పార్టీ ప్రజాప్రతినిధులతో తాజాగా శుక్రవారం మరోసారి సమావేశమయ్యారు. నిర్మల్ ఖానాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్‌లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి, రామ్ కిషన్ రెడ్డి ఆయా పార్టీల మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు పార్టీ మండల అధ్యక్షులతో మరోసారి సమావేశమై జనం తరలింపు పై మాట్లాడారు. లక్షకు పైగా జనం హాజరవుతారని తొలుత అంచనా వేసుకున్న అధికార పార్టీ అంతకుమించి జనాన్ని తరలించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బహిరంగ సభ నిర్వహించే ప్రదేశాన్ని ఒకటికి రెండుసార్లు పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలెక్టర్ వరుణ్ రెడ్డి ఎస్పీ ప్రవీణ్ కుమార్ తదితరులు భద్రతా చర్యలపై కూడా సమాలోచనలు చేశారు.
బహిరంగ సభ వేదికకు ప్రధానంగా మూడు వైపుల నుంచి దారులు ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ సభ వేదిక పైకి స్పెషల్ పాస్ లు ఉన్నవారిని మాత్రమే ఆహ్వానించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధులు మీడియా అధికారులకు ప్రత్యేకంగా పాసులు జారీ చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి చేయాల్సిన వసతులపై కూడా అధికారులతో చర్చించారు. బహిరంగ సభ సాయంత్రం జరిగే అవకాశం ఉన్నందున రాత్రి కాకముందే ప్రజలను తిరిగి సొంత ప్రాంతాలకు తరలించే విషయంలోనూ మంత్రి సంబంధిత ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. మొత్తంగా సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్ని తానై వ్యవహరిస్తున్నారు.