జోడేఘాట్ ప్రాంత అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం

జోడేఘాట్ ప్రాంత అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క అన్నారు.

Update: 2024-10-17 13:43 GMT

దిశ, ఆసిఫాబాద్ : జోడేఘాట్ ప్రాంత అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క అన్నారు. గురువారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం జోడేఘాట్ లో నిర్వహించిన కొమురం భీం వర్థంతిలో ఆమె పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. అనంతరం జోడేఘాట్ లో ఏర్పాటు చేసిన దర్బార్ లో ఆమె మాట్లాడారు. జల్, జంగల్, జమిన్ కోసం, ఆదివాసుల హక్కుల సాధనకు నిజాం పాలనకు వ్యతిరేకంగా, అటవీ హక్కుల సాధనకు కొమరం భీం నిరంతరం పోరాడారని కొనియాడారు.

     అలాంటి ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని, వాటిని అనుసరించాలని సూచించారు. ఆ మహనీయుడి రక్తంతో తడిసిన ఈ పవిత్రమైన జోడేఘాట్ ప్రాంతాన్ని భవిష్యత్తులో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. జోడేఘాట్ టూరిజం కోసం రూ. 6 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో భూములు ఆక్రమణకు గురి కాకుండా 12 గ్రామాల పరిరక్షణ కమిటీతో పాటు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. అర్షులైన ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

    చదువుకున్న ఆదివాసీ యువకులు మత్తుకు బానిసలు కాకుండా వారి కోసం ఉట్నూర్ కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. కొమురం భీం అడ ప్రాజెక్ట్, వట్టి వాగు ప్రాజక్టు, పోడు భూముల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేసుకొని పరిష్కరించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గేడం నాగేష్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, వెడ్మ జొజ్జు, కోక్కిరాల పేంసాగర్, పాల్వాయి హరిష్ బాబు, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, టీడీఏ పీఓ ఖుష్బూగుప్తా, కాగజ్ నొప్పిగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, భీం మనువడు సోనేరావు, ఆదివాసీ గిరిజన నాయకులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News