ధాన్యం సీఎంఆర్‌లో రైస్‌ మిల్లర్ల గోల్‌మాల్‌!

సీఎంఆర్‌ బియ్యం వ్యవహారంలో రైస్‌ మిల్లులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా అధికారులు క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేదు.

Update: 2024-07-04 02:47 GMT

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో: సీఎంఆర్‌ బియ్యం వ్యవహారంలో రైస్‌ మిల్లులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా అధికారులు క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ వ్యవ‌హారంలో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది రైస్‌మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి సీఎంఆర్‌ బియ్యం విషయంలో పౌర సరఫరాల శాఖను పక్కదోవ పట్టిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. రైస్‌ మిల్లర్లు సీఎంఆర్‌ బియ్యం విషయంలో పౌర సరఫరాల శాఖ నిర్దేశించిన గడువు ధిక్కరిస్తున్నారు.

ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా, అధికారులు మొత్తుకుంటున్నా రైస్ మిల్లర్లు క‌నీసం మార‌డం లేదు. రైతుల వ‌ద్ద ధాన్యాన్ని సేక‌రించి మిల్లుల‌కు పంపిస్తే వాటిని మాయం చేసి అక్రమంగా మార్కెట్కు త‌ర‌లిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు అడిగితే చాలా లైట్‌గా తీసుకుంటున్నారు. ఈ వ్యవ‌హారంలో అధికారుల పాత్ర కూడా కొట్టి పారేయ‌లేమ‌ని ప‌లువురు స్పష్టం చేస్తున్నారు. మిల్లర్లతో చేతులు క‌లిపి రైస్‌మిల్లర్లు చేస్తున్న అక్రమాల‌కు వంత పాడుతున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

సీఎంఆర్ కు కేటాయించిన ధాన్యం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైస్‌ మిల్లర్లు మ‌హారాష్ట్రకు త‌ర‌లించి అమ్ముకుంటున్నారు. దీంతో వ్యాపారులు రూ.కోట్లు గ‌డిస్తున్నారు. మిల్లర్లు తమ పరపతిని అడ్డం పెట్టుకొని సీఎంఆర్‌ బియ్యాన్ని చెల్లించకుండా జాప్యం చేస్తూ వస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్నేళ్ల నుంచి సిండికేట్‌గా ఏర్పడి ధాన్యం సేకరణ నుంచి మొదలుకుని సీఎంఆర్‌ బియ్యం తిరిగి ఇచ్చే వరకు మిల్లర్లు చక్రం తిప్పుతున్నారు. ఈ మిల్లర్లపై అధికారులు సైతం ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు.

ధాన్యం సేకరణ ఘనం

వాస్తవానికి ప్రభుత్వ ఆదేశాల మేర‌కు 2022-23 యాసంగి సీజ‌న్‌కు సంబంధించి గ‌డువు ముగిసినా మిల్లర్లు క‌నీసం ప‌ట్టించుకోలేదు. ల‌క్ష్యాన్ని పూర్తి చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. ఈ ఏడాది ఏప్రిల్ చివ‌రికి పూర్తి చేయాలి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎంఆర్ పెండింగ్‌లో ఉంది. 2022-23 యాసంగి పంట‌ల‌కు సంబంధించి మంచిర్యాల జిల్లాలో 92,169 ట‌న్నుల ధాన్యం సేక‌రించ‌గా, 62,103 ట‌న్నుల బియ్యం సీఎంఆర్ చేయాల‌ని మిల్లుల‌కు అందించారు. కేవ‌లం 19,648 మాత్రమే సీఎంఆర్ చేశారు. ఇంకా 42,455 ట‌న్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఇక నిర్మల్ జిల్లా ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంది. ఈ జిల్లాలో 1,58,566 ట‌న్నుల ధాన్యం సేక‌రించ‌గా,ఇందులో 1,06,542 ట‌న్నుల బియ్యం సీఎంఆర్ చేయాల‌ని ఆదేశించారు.

అయితే ఇప్పటి వ‌ర‌కు కేవ‌లం 5,309 ట‌న్నులు మాత్రమే సీఎంఆర్ చేయ‌గా, మిగ‌తా 1,01,233 చేయాల్సి ఉంది. ఇక కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సైతం 24, 197 ట‌న్నుల ధాన్యం సేక‌రించ‌గా, 16,313 ట‌న్నుల బియ్యం సీఎంఆర్ చేయాల‌ని చెప్పారు. ఇప్పటి వ‌ర‌కు 2,175 ట‌న్నులు మాత్రమే సీఎంఆర్ చేయ‌గా, మిగ‌తా 14, 138 చేయాల్సి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 60, 993 ధాన్యం సేక‌రించ‌గా, 40,865 ట‌న్నుల ధాన్యం సీఎంఆర్‌కు అప్పగించారు. ఇప్పటి వ‌ర‌కు 20,907 సీఎంఆర్ ఇచ్చారు. ఇంకా 19,959 సీఎంఆర్ ధాన్యం ప్రభుద్వానికి రావాల్సి ఉంది.

అడ్డగోలుగా త‌ర‌లింపులు..

సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి అడ్డగోలుగా త‌ర‌లిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో 2021-22, 2022-23 యాసంగి సీజన్లో వరి ధాన్యం పెద్ద మొత్తంలో కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. కొంతవరకు మిల్లులకు తరలించగా, మిగిలిన ధాన్యం వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల్లో ఏజెన్సీలను బాధ్యులను చేస్తూ దింపించారు. కోట్ల విలువైన ఈ ధాన్యం అప్పటి నుంచి గోదాముల్లో మగ్గిపోతున్నది. దీనిపై సివిల్ సప్లయ్ కమిషనర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసి ధాన్యాన్ని వెంటనే గోదాముల్లోంచి తరలించాలని ఆదేశించారు. 2021-22 యాసంగి సీజన్ ధాన్యాన్ని మిల్లులకు, 2022-23 ధాన్యాన్ని టెండర్లో పాడుకున్న వారికి పంపించాలని సూచించారు.

12 గోదాముల్లోని డీఆర్డీఏ (ఐకేపీ), పీఏసీఎస్, డీసీఎంఎస్ ఏజెన్సీల పరిధిలోని 23,955,920 మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలోని కొన్ని మిల్లులకు, పెద్దపల్లి జిల్లాలోని రెండు మిల్లులకు పంపారు. కానీ ఇంతవరకు ధాన్యం దించుకున్న మిల్లర్లు తమకు ఇంత ధాన్యం వచ్చినట్టు ఆక్నాలెడ్జ్ మెంటు (మిల్లర్ రిసీప్ట్) కాపీ ఏజెన్సీలకు, సివిల్ సప్లయ్ అధికారులకు ఇవ్వలేదు. దీంతో గోదాముల నుంచి వెళ్లిన ధాన్యం మిల్లులకే పోయిందా? లేదా బయటకు వెళ్లిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Similar News