వారు కమీషన్ల.. కన్వీనర్లు
బోథ్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే వర్గీయులు కమీషన్ల కన్వీనర్లుగా అవతారమెత్తారని అధికార పార్టీకి చెందిన మాజీమంత్రి గోడం నగేష్ అనుచరులు తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
దిశ, ఇచ్చోడ : బోథ్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే వర్గీయులు కమీషన్ల కన్వీనర్లుగా అవతారమెత్తారని అధికార పార్టీకి చెందిన మాజీమంత్రి గోడం నగేష్ అనుచరులు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. మాజీ ఎంపీ జన్మదిన సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, ఎమ్మెల్యే పేరు కూడా ప్రస్తావన రాలేదని వారు స్పష్టం చేశారు. ఆదివారం ఇచ్చోడలోని విట్టల్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో బోథ్ నియోజక వర్గంలో విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతోందని వివిధ పత్రికల్లో వస్తున్న కథనాలపై ఎందుకు ఖండించలేకపోతున్నారని మాజీ ఎంపీ గోడం నగేష్ పేర్కొన్నారని వారు గుర్తుచేశారు.
మాజీ పార్లమెంటు సభ్యున్ని విమర్శించే హక్కు వారికి లేదని, విమర్శలు మానుకుని నియోజక వర్గం అభివృద్ధికి పాటుపడాలని వారు హితవు పలికారు. బోథ్ నియోజక వర్గంలో కొందరు మండల కన్వీనర్లు దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో కమీషన్ల తీసుకుంటూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారంటూ వారు ధ్వజమెత్తారు. లబ్ధిదారుల నుంచి ఎంత డబ్బు తీసుకున్నారో తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, సమయం వచ్చిన ప్పుడు ప్రజల ముందు ఉంచుతామని వారు చెప్పారు. అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించిన వారి గెలుపుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు కృష్ణ కుమార్, ఆడే శీల, కదం ప్రశాంత్, నానం రమణ, చిలుకూరి భూమన్న, శంకర్, చట్ల ఉత్తం, పాండురంగ్, పెంటన్న, మైమూద్ ఖాన్, సూదివినాయక్, తూరటి భోజన్న, పెందూరు తులసీ, హారన్ సుభాష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.