cotton price : తెల్ల బోతున్న పత్తి రైతు..

చేతికొచ్చిన పత్తి పంటను అమ్ముకుందామని భావిస్తున్న రైతులకు క్రమంగా తగ్గుతున్న ధరలతో ఆందోళన చెందుతున్నారు.

Update: 2024-11-05 07:55 GMT

 దిశ, ఆసిఫాబాద్ : చేతికొచ్చిన పత్తి పంటను అమ్ముకుందామని భావిస్తున్న రైతులకు క్రమంగా తగ్గుతున్న ధరలతో ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి రాకముందు మంచి ధర ఉండగా.. తీరా అమ్ముదామనుకుంటే గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పండించిన పంటకు సరైన ధర రాకపోవడంతో రైతులు ఈ ఏడాది కూడా అప్పుల నుంచి బయట పడేదెలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల ముందు వరకు 8 వేలు ఉన్న పత్తి ధర తాజాగా 6500 వేలకు పడిపోవడంతో తమ పరిస్థితి ఏమిటని దిగులు పడుతున్నారు. ప్రభుత్వం 8 వేలు మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 3 లక్షల 30 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా. 23 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సారి భారీ వర్షాల నేపథ్యంలో పత్తి పంట పూత, పిందె సమయంలో కొంతమేర పంట దెబ్బతింది. దీంతో పత్తి దిగుబడి కూడా ఆశించిన మేర వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు.

ప్రారంభానికి నోచుకోని సీసీఐ కొనుగోలు కేంద్రాలు..

పత్తి అమ్మకాల కోసం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని.. గత ఏడాది మాదిరిగా కాకుండా ఆయా మండలాల్లో వచ్చే దిగుబడిని బట్టి మండలానికి ఒకటి లేదా రెండు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తామని చెప్పిన జిల్లా అధికారులు నేటి వరకు జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. కానీ పత్తి మార్కెట్ లోకి వచ్చి వారం రోజులు కావస్తున్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులే రైతులకు దిక్కయ్యారు. గిట్టుబాటు ధర కాకున్నా.. అవసరాల కోసం విక్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సిండికేట్ గా మారిన వ్యాపారులు..

జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులంతా సిండికేట్ గా మారి ధర తగ్గించి పత్తి కొనుగోళ్లు జరుపుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మంచి రకం పత్తికి కూడా నాణ్యత లేదనే సాకుతో తక్కువ ధరనే చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు. తేమ శాతం తక్కువగా ఉన్నదనే కారణం చెప్పి కొత్తగా వచ్చిన పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు జరిపి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

రైతుల చుట్టూ దళారులు..

పత్తి పంట చేతికి రావడంతో దళారులు గ్రామాల్లో తిరుగుతూ రైతులను మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం కల్పించే మద్దతు ధర కంటే రూ.500 ఎక్కువ ఇస్తామని.. తేమశాతం. రంగుమారిన కొనుగోలు చేస్తామని నమ్మబలుకుతున్నారు. దీంతో కొందరు అమాయక రైతులు దళారుల వైపు మొగ్గు చూపుతున్నారు.

Tags:    

Similar News