SP Gauss Alum : ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకోవాలి..

గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పోలీస్ అధికారులకు సూచించారు.

Update: 2024-07-23 15:57 GMT

దిశ, ఆదిలాబాద్ : గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలను, వాటి స్థితిగతులను పరిశోధన విధానాన్ని పరిశీలించడానికి జిల్లా పోలీసు అధికారులతో మంగళవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గల సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం నెలవారి నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులతో పలుసూచనలు చేసిన ఎస్పీ నిరంతరం గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకొని, గ్రామాల పై పూర్తి పట్టు సాధించాలని సూచించారు. ప్రజలలో ప్రస్తుతం సైబర్ నేరాల పై, బాల్యవివాహాలు, అసాంఘిక కార్యకలాపాల పై పూర్తిగా సవివరంగా వివరించి ప్రజలను చైతన్య పరచాలని తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాలను సేవించకుండా, వినియోగించకుండా, అదేవిధంగా మాయ మాటలు చెప్పే దళారుల చేతిలో మోసపోయి వాటిని పండించడం వల్ల ప్రభుత్వం వల్ల వచ్చే సత్ఫలితాలను కోల్పోయి, పోలీసు కేసుల బారిన పడతారని తెలియజేయాలన్నారు.

సైబర్ నేరాలకు గురైన బాధితుల ధనాన్ని తిరిగి వచ్చే విధంగా కోర్టులను, బ్యాంకులను సంప్రదించి బాధితులకు న్యాయం చేకూరే విధంగా కృషి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, పోలీసు కార్యాలయాలను ప్రతిరోజు శుభ్రపరుస్తూ పరిశుభ్రతను పాటించాలన్నారు. నేరాలకు పాల్పడే వారిపై రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎటువంటి అలసత్వం లేకుండా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా సాయంత్రం సమయాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో టెస్టులు నిర్వహిస్తూ ఉండాలని సూచించారు. నూతన చట్టాల పై ప్రతి ఒక్క సిబ్బందికి అవగాహన కల్పిస్తూ ప్రత్యేకంగా శిక్షణను పోలీస్ స్టేషన్ల వారీగా అందించాలని సూచించారు.

బాధితులకు మొబైల్ ఫోన్లు అందజేత...

జైనథ్, బేల పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ కారణాలతో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు 14 మొబైల్ ఫోన్ లను విచారణలో కనుగొని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని సమావేశ మందిరంలో తిరిగి బాధితులకు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం చేతుల మీదుగా అందజేశారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న, దొంగిలించబడిన వెంటనే సీఈఐఆర్ వెబ్ పోర్టల్ లో ఫిర్యాదులను నమోదు చేయాలని లేదా దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. ఈ సమీక్షలో డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సీహెచ్ నాగేందర్, హసిబుల్ల ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News