వైద్యారోగ్య ఉద్యోగులకు అండగా ఉంటా.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు అండగా ఉంటానని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు.

Update: 2023-05-30 17:41 GMT

దిశ, నిర్మల్ రూరల్ : నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు అండగా ఉంటానని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం మంత్రి నివాసంలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులర్ చేసిన సందర్భంగా ప్రజా ఆరోగ్య వైద్య ఉద్యోగుల సంఘం 3194 నిర్మల్ జిల్లా శాఖ పక్షాన సీఎం కేసీఆర్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయం నుంచి వైద్య ఆరోగ్య ఉద్యోగుల పై తీవ్రమైన పనిభారం పెరిగిందని వారికి అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని హామీఇచ్చారు. నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అదనపు నిధులు మంజూరు చేయించి ఉద్యోగులందరికీ ఆర్థిక సహాయం చేస్తామన్నారు.

ఉద్యోగ సంఘ భవననిర్మాణం కోసం 20 లక్షల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రెండో ఏఎన్ఎంల జీతభత్యాల పెంపుదల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి టైం స్కేల్ ఇప్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల విధానం భవిష్యత్తులో ఇక ఉండబోదని చెప్పారు. ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న టీబీ లెప్రసీ మలేరియా ఎయిడ్స్ అర్బన్ హెల్త్ సెంటర్స్ 108, 104 తదితర శాఖల ఉద్యోగులకు సంబంధించి వారి ఉద్యోగ భద్రత కోసం చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగుల పై పనిభారం విషయం లో ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ మోహన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కన్నయ్య కోశాధికారి వేణు గోపాల్ రావు, సంఘ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జయ ప్రమోద, మాధురి, సరస్వతి, వరలక్ష్మి, రమణారెడ్డి, సురేష్ రెడ్డి, పురుషోత్తం, ఉమారాణి, మతిన్, రవికుమార్ పాల్గొన్నారు.

Tags:    

Similar News