రాజ్యాంగ ధర్మాన్ని పాటిస్తూ విధులు నిర్వహించాలి
నీతి నిజాయితీలతో పాటు రాజ్యాంగ ధర్మాన్ని పాటిస్తూ పోలీసులు విధులు నిర్వహించాలని పీఅండ్ఎల్ ఐజీ రమేష్ అన్నారు.
దిశ, ఆదిలాబాద్ : నీతి నిజాయితీలతో పాటు రాజ్యాంగ ధర్మాన్ని పాటిస్తూ పోలీసులు విధులు నిర్వహించాలని పీఅండ్ఎల్ ఐజీ రమేష్ అన్నారు. ఉద్యోగ రీత్య ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు. గురువారం స్థానిక పోలీసు శిక్షణ కేంద్రంలో 9 నెలలపాటు నిరంతరంగా కఠోర శ్రమతో కూడిన శిక్షణను పూర్తి చేసుకున్న 6 జిల్లాల 254 స్టైఫండరి ట్రైనీ సివిల్ కానిస్టేబుళ్లు పరేడ్ నిర్వహించారు. ఈ శిక్షణలో రాజన్న సిరిసిల్ల -35, సూర్యాపేట - 129, జగిత్యాల్ - 34, ములుగు - 16, సంగారెడ్డి -15,సైబరాబాద్ - 25 మంది ఉన్నారు.
శిక్షణ సమయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు, జైనూర్ సంఘటన, దేవీ నవరాత్రి ఉత్సవాల బందోబస్తు నిర్వహించారు. కాగా ఈ పరేడ్ లో ముఖ్య అతిథిగా తెలంగాణ పీఅండ్ఎల్ ఐజీ రమేష్ తో పాటు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌష్ ఆలం, రెండవ బెటాలియన్ కమాండ్ డెంట్ నితిక పంత్, శిక్షణ ఐఏఎస్ అభిజ్ఞన్, జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, కానిస్టేబుల్ ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ చట్టాన్ని ఉల్లంఘించకుండా రాజ్యాంగ ధర్మాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ విధులను నిర్వర్తించాలని సూచించారు.
తాను కూడా ఒకప్పటి ఆదిలాబాద్ జిల్లాలో శిక్షణను తీసుకున్నట్లు గుర్తు చేశారు. పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైన విషయమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం శిక్షణను తీసుకున్న కానిస్టేబుళ్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు సిబ్బందికి ఇండోర్, అవుట్డోర్, బెస్ట్ ఆల్రౌండర్, పరేడ్ కమాండర్ విభాగాలలో బహుమతులు ప్రదానం చేశారు.
అదే విధంగా శిక్షణను అందించిన 50 మంది పోలీసు సిబ్బందికి, వైద్య సిబ్బంది, న్యాయసహాయం చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ సి.సమయ్ జాన్ రావు, అదనపు ఎస్పీ (ఆపరేషన్) బి.సురేందర్ రావు, డీఎస్పీలు ఎల్.జీవన్ రెడ్డి, బి.సురేందర్ రెడ్డి, ప్రకాష్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.