సర్వేలో.. ఆదాయం, ఆస్తుల వివరాలు ఎందుకు ?
కుల గణన సర్వేలో ఆస్తులు వివరాలు ఎందుకు సేకరిస్తున్నారనే అనుమానాలు ప్రజలను వెంటాడుతున్నాయి.
దిశ, కౌటాల : కుల గణన సర్వేలో ఆస్తులు వివరాలు ఎందుకు సేకరిస్తున్నారనే అనుమానాలు ప్రజలను వెంటాడుతున్నాయి. ఈ నెల 6 నుంచి 8 వరకు ఇంటి నెంబర్ యజమాని పేరు నమోదు చేసి డోర్లకు స్టిక్కర్లు అందించే ప్రక్రియ సాగింది. 9వ తేదీ నుంచి మండలంలో కుల గణన సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. ఈ సర్వేలో ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలు సేకరిస్తున్నారు. 56 రకాల ప్రశ్నలతో వివరాలను నమోదు చేస్తున్నారు. వీటిలో ఆదాయం ఆస్తులు, భూములు ఇంకా పలు రకరకాల ప్రశ్నలు వేసి సమాచారం రాబడుతున్నారు. ఇలాంటి వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తే, ఇప్పటి వరకు తమ వద్ద ఉన్న తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు తొలగిస్తారేమో అని పలువురు అనుమానాలు పడుతున్నారు. ఇంకా భూములు ఉన్న రైతులు తమకు రైతు భరోసా అందకుండా పోతుందేమో అని ఆందోళన చెందుతున్నారు.
మరి కొంతమంది తమకు వృద్ధాప్య పింఛన్ తీసేస్తారేమో దిగులు చెందుతున్నారు. ఇలాంటి వ్యక్తిగత వివరాలు ఎందుకు ఇవ్వాలని గ్రామాల్లో చర్చ జరుగుతుంది. కుల గణనకు విరుద్ధంగా ప్రశ్నావళి ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కుల గణన చేస్తామని చెప్పే వ్యక్తి గత సమాచారాన్ని సేకరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మండలంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 32,815. 20 గ్రామ పంచాయతీల పరిధిలో 10,828 ఆవాసాలు ఉన్నాయి. సర్వే కోసం గ్రామంలో 86 బ్లాకులుగా చేశారు. 74 ఎనుమరేటర్లు 8 మందిని సూపర్వైజర్లు ఏర్పాటు చేశారు. ఇది ఇలా ఉండగా సర్వే పై ఉన్న అపోహలను తొలగించేందుకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అయినా ఈ వివరాలన్నీ ఇస్తే తమకు ప్రభుత్వం నుంచి లభిస్తున్న పథకాలు పోతాయమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.