సర్వే పై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మొద్దు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి రాజకీయ, సమగ్ర కులగణన సర్వే పై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మొద్దని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.

Update: 2024-11-11 14:05 GMT

దిశ, ఉట్నూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి రాజకీయ, సమగ్ర కులగణన సర్వే పై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మొద్దని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. సోమవారం ఉట్నూర్ మండలంలోని తన స్వగ్రామమైన కల్లూరు గూడా గ్రామంలో నిర్వహించిన సర్వేలో పాల్గొని కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే పట్ల సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలెవరూ నమ్మొద్దని, విద్యావంతులు సర్వేకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో మాట్లాడడం విచారకరమన్నారు. సబ్బండ వర్గాల ప్రజలకు సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో న్యాయం చేయడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి పక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా నిలబెట్టేందుకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సీఏం రేవంత్ రెడ్డి సారథ్యంలో కుల గణన చేపట్టి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.

భారత రత్న మౌలనా అబుల్ కలాం అజాద్ అడుగుజాడల్లో నడవాలి..

స్వాతంత్ర సమర యోధుడు భారత రత్న మౌలనా అబుల్ కలాం అజాద్ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. సోమవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మౌలనా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత దేశ మొట్ట మొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. మహాత్మా గాంధీజీతో కలసి అనేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారన్నారు. దేశం కోసం వారు అందించిన సేవలు మరువలేనివన్నారు. నేటి యువత అయన చూపిన మార్గంలో నడవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News