లోహార గ్రామంలో ప్రారంభమైన డిజిటల్ సర్వే

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ల జారీ కోసం పైలెట్ ప్రాజెక్టు కార్యక్రమంలో భాగంగా గురువారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లోహర గ్రామంలో అధికారులు సర్వే నిర్వహించారు.

Update: 2024-10-03 09:01 GMT

దిశ, ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ల జారీ కోసం పైలెట్ ప్రాజెక్టు కార్యక్రమంలో భాగంగా గురువారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లోహర గ్రామంలో అధికారులు సర్వే నిర్వహించారు. ఇంటింటి సర్వేలో భాగంగా అధికారులు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు సేకరిస్తూ ఆ కుటుంబ యజమానిగా మహిళ పేరును రాసుకుంటున్నారు. అదేవిధంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కటిగా ప్రత్యేక కాలంలో నమోదు చేస్తున్నారు. వారికి ప్రభుత్వం నుంచి కావలసిన సౌకర్యాలు ఇప్పటివరకు లబ్ధి పొందిన వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.

దీంతో ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్ మండలంలో గల లోహార గ్రామంలో చేపట్టిన ఈ సర్వేతో పాటు ఆదిలాబాద్ అర్బన్, ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాల్లో చేపట్టిన సర్వేను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేసి సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. డిజిటల్ కార్డ్ ల జారీ కోసం పైలెట్ ప్రాజెక్టు కార్యక్రమం కింద చేపడుతున్న ప్రయోగాత్మక ఇంటింటి సర్వే లో ఎలాంటి తప్పులు లేకుండా ప్రతి ఇంటింటికి వెళ్లి వారి పూర్తి సమాచారాన్ని సర్వే ఫారం లో నమోదు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఇంటి యజమాని గా మహిళా పేరు ఉండాలని, తదుపరి కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయాలని సూచించారు.

అనంతరం మొబైల్ ఫోన్ లో ఫొటో తీసుకోవాలని తెలిపారు. సర్వేను పకడ్బందీగా తప్పులు లేకుండా కుటుంబం లో ఎంత మంది ఉన్నారో, వారి వివరాలు నమోదు చేయాలని ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమమని తెలియజేశారు. అయితే తమకు ఎన్నో ఏళ్లుగా నీటి సమస్య ఉందని గ్రామస్తులు తెలపగా,ఆ సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు. కాగా ఈ డిజిటల్ సర్వే కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలు తమ వివరాలతో కూడిన పత్రాలను అధికారులకు సమర్పించడంతో పాటు సానుకూలంగా స్పందిస్తూ..తాము ఎదుర్కొనే సమస్యలు పరిష్కరిస్తే చాలని అధికారులను కోరారు. ఈ సర్వేలో ఆర్డీవో వినోద్ కుమార్, ఎంపిఓ ఆనంద్,ఎంపీడీవో, సిబ్బంది , తదితరులు ఉన్నారు.


Similar News