నో..ఆప్షన్..కొత్త సమస్యలను తెచ్చి పెట్టిన ధరణి పోర్టల్..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరించేందుకు అమలులోకి తెచ్చిన ధరణి పోర్టల్ కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది.
దిశ, మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరించేందుకు అమలులోకి తెచ్చిన ధరణి పోర్టల్ కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. ధరణితో భూ సమస్యలు పరిష్కార మవుతాయనుకుంటే పోర్టల్ లో అవసరమైన ఆప్షన్లు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ధరణి పోర్టల్ ఆవిష్కరణకు ముందు భూ దస్త్రాల ప్రక్షాళన సమయంలో కొందరు రెవెన్యూ అధికారుల, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకున్న తప్పిదాలతో కూడా పోర్టర్ లో పొరపాట్లు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
కొన్ని పొరపాట్లను సవరించుదామనుకుంటే అధికారుల వద్దపరిష్కారం చూపలేని పరిస్థితులున్నాయి. ప్రభుత్వం కొన్ని సమస్యలకు ఆప్షన్లు ఇస్తూ.. వస్తున్నా అవసరమైన ఆప్షన్లు రాకపోవడంతో పొరపాట్లను సవరించే వీలు లేనిపరిస్థితి ఉంది. తమ భూ సమస్యలను పరిష్కరించి డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని కొందరు రైతులు రెవెన్యూ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. పోర్టల్ లో చోటు చేసుకున్న తప్పిదాలతో కొందరు రైతుల మధ్య వివాదాలు తలెత్తి పరిష్కారం కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు.
మూడేళ్లు కావస్తున్నా..
ధరణి పోర్టల్ ను ప్రభుత్వం ప్రారంభించి మూడేళ్లు కావస్తోంది. అంతకు ముందుగా భూ దస్త్రాల ప్రక్షాళన ద్వారా భూ రికార్డులను డిజిటలైజేషన్ చేసిపోర్టల్ ను అమలులోకి తెచ్చింది. అయితే కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పోర్టల్ లో పొరపాట్లు, తప్పిదాలు చోటుచేసుకున్నాయి. ఒకరి పేరు మీద ఉన్న పట్టాభూమి మరొకరి పేరు పడటం, ఉన్న విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణం నమోదు కావడం, పేర్లు, ఆధార్ కార్డు నెంబర్లలో తప్పులు, కొన్ని పట్టా భూములు నిషేధిత, ప్రాజెక్టుల ముంపు జాబితాల్లోకి చేరడం లాంటివి చాలా మటుకు చోటు చేసుకున్నాయి. మంచిర్యాల జిల్లాలో ఇలాంటివి చోటు చేసుకోగా, భూ సమస్యల బాధితులు రెవెన్యూ, కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సమస్యపరిష్కారం కాక ఇబ్బందులు పడాల్సివస్తోంది.
ధరణి పోర్టల్ అమల్లోకి రాకముందు హాజీపూర్ మండలంలోని ముల్కల గ్రామ శివారులోని సర్వేనెంబర్ 211లో మోట పలుకుల రాములు పేరిట 2.28 ఎకరాల పట్టాభూమి ఉంది. అతడు ఎప్పుడో చనిపోగా విరాసత్ ద్వారా అతని నలుగురు కుమారులకు సమానం వాటాగా పట్టా పాస్ బుక్ లు జారీ కావాలి. కాగా అతని కుమారులు విరాసత్ చేసుకునే విషయంలో కాలయాపన చేశారు. ఆలోగా భూ దస్త్రాల ప్రక్షాళన ప్రారంభమైంది. ధరణి అమల్లోకి రాగా భూ దస్త్రాల ప్రక్షాళన సమయంలో రెవెన్యూ సిబ్బంది చేసిన పొరపాటు ఆ అన్నదమ్ముల కుటుంబాల్లో చిచ్చుపెట్టింది.
ఎలాంటి డాక్యుమెంట్లు, ఆధారాలు లేకుండానే రాములు పెద్ద కుమారుడైన లచ్చయ్య కొడుకు మోట పలుకుల రామయ్య పేరును పోర్టల్ లోకి ఎక్కించారు. ధరణి పోర్టల్ ద్వారా రామయ్యకు డిజిటల్ పాస్ బుక్ జారీ చేశారు. మూడేళ్లుగా అతడు రైతుబంధు సాయాన్ని సైతం పొందుతున్నాడు. ఈ విషయం తెలిసి మిగతావారు సమస్య పరిష్కారానికి రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం కానరావడం లేదు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు.
లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెలకి చెందిన పొట్లంచెర్ల చంద్రయ్య అనే రైతుకు ఆ గ్రామ శివారులో సర్వేనెంబర్ 217లో 1.27ఎకరాలు భూమి ఉంది. పోర్టల్ లో నమోదై డిజిటల్ పాస్ బు కూడా జారీ అయ్యింది. 2020 - 21 సంవత్సరానికి రైతుబంధు సాయం కూడా పొందాడు. గత యేడాది ధరణిలో ఆ సర్వే నెంబర్ లోని పట్టా భూమి డిలీట్ కాగా, రైతుబంధు సాయం నిలిచిపోయింది. దీంతో ఆ రైతు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా శ్రీపాద ఎల్లంపల్లిముంపు జాబితాలో భూమి చేరినట్లు చావు కబురు చల్లగా చెప్పారు. ముంపులో లేని తన పట్టాభూమి ఎందుకు డిలీట్ అయిందని అడిగినా రైతు పట్టించుకునే వారేలేరు. ఆ పొరపాటును సరిచేసి తనకు న్యాయం చేయాలని బాధితుడు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావడం లేదు.
అదే మోదెల గ్రామానికి చెందిన కిల్లేటి లక్ష్మికి సర్వేనెంబర్ 220లో 1.33 ఎకరాల పట్టాభూమి ఉంది. ధరణిలో పొరపాట్లతో తక్కువ విస్తీర్ణం నమోదైంది. 1.26 ఎకరాల భూమి మాత్రమే నమోదై డిజిటల్ పాస్ బుక్ జారీ అయ్యింది. తగ్గించిన విస్తీర్ణం పోర్టల్ లో పూర్తి విస్తీర్ణానికి సరిచేయాలని దరఖాస్తు చేసినా ఈమెసమస్య పరిష్కారం కావడం లేదు.
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు..
ధరణి అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కలెక్టరేట్లో, మండల తహసిల్దార్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అందులో కొన్ని పరిష్కారం అవుతుండగా, అవసరమైన ఆప్షన్లు లేక కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తుల్లో సగానికి పైగా భూ సమస్యలవే కావడం గమనార్హం. ఆప్షన్లు లేవనే సాకు చెబుతూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారే తప్ప బాధితుల సమస్యకు పరిష్కారం చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అప్పట్లో రాష్ట్ర మంత్రిహరీష్ రావు ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ కూడా భూ సమస్యల పరిష్కారానికి ఆప్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కాగా ప్రభుత్వం ఆప్షన్లు ఇస్తూ వస్తున్నా అవసరమైన ఆప్షన్లు లేకపోవడంతో చాలా మటుకు భూ సమస్యలు పరిష్కారం కాలేక పెండింగ్ లోనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భూ సమస్యల పరిష్కారానికి అవసరమైన ఆప్షన్లు ఇచ్చి ధరణి పోర్టర్ ద్వారా జరిగిన పొరపాట్లను, తప్పులను సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.