Graduate MLC Elections:గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై పార్టీ అధిష్టానం పోస్టుమార్టం చేస్తున్నది.

Update: 2024-10-18 02:14 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై పార్టీ అధిష్టానం పోస్టుమార్టం చేస్తున్నది. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో సహా 10 నియోజకవర్గాల్లో పార్టీలో ఉన్న విభేదాల పై టీపీసీసీ దృష్టి సారించింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం గాంధీభవన్‌లో జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్టీ ముఖ్య నేతల సమావేశం అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. సమావేశంలోనే ప్రత్యక్షంగా కొన్ని సూచనలు చేసిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రానున్న రోజుల్లో అనుసరించే వ్యూహంపై ప్రణాళిక చేస్తున్నట్లు తెలిసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన ఓటర్లను ఎన్ రోల్ మెంట్ చేయించడంపై ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాల అధ్యక్షులు, 10 నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జీలు బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా అధిష్టానం దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. మరోవైపు పలు నియోజకవర్గాల్లో పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల పై కూడా చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఈ వారంలోనే అభ్యర్థిపై స్పష్టత..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి రానున్న కరీంనగర్ - ఆదిలాబాద్ - నిజామాబాద్ - మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పై ప్రధాన చర్చ జరిగినట్లు తెలిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేకంగా చర్చించిన తర్వాత పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు, ఆరుగురు నియోజకవర్గాల ఇన్చార్జిలతో సుదీర్ఘంగా పార్టీ అధిష్టానం చర్చలు జరిపింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి ఓడిపోయినప్పటికీ పార్టీ గణనీయమైన ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు ప్రక్రియ అత్యంత కీలకమైన నేపథ్యంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకుని సభ్యత్వ నమోదు భారీ మొత్తంలో జరిగేలా చూడాలని దీపా దాస్ మున్షీ, మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయా నియోజకవర్గాల్లో మండలాల వారీగా పార్టీ శ్రేణులకు బాధ్యతలు అప్పగించి సభ్యత్వ నమోదు పై దృష్టి పెట్టాలని అధిష్టానం సూచించింది. ఇదిలా ఉండగా అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నామని ఈ వారంలోనే అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత ఇస్తామని కూడా ఈ సమావేశంలో స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సంఘటితంగా ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.

పలు నియోజకవర్గాల్లో పార్టీ విభేదాల పైన చర్చ..?

ఇదిలా ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల పై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. ముఖ్యంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అక్కడి జిల్లా అధ్యక్షుడిని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గట్టిగా విభేదించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ముఖ్య నేతలే వెన్నుపోటు పొడిచారని, పార్లమెంట్ ఎన్నికల సమయంలో సమన్వయం లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఈ సమావేశంలో అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లినట్లు సమాచారం. అవసరమైతే ఇంటెలిజెన్స్ వర్గాలతో సమాచారం తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. అలాగే ఆదిలాబాద్, బోథ్, ముధోల్, నిర్మల్, బెల్లంపల్లి నియోజకవర్గంలో గ్రూపు విభేదాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. వీటన్నింటి పై త్వరలోనే అధిష్టానం ప్రత్యేక దూతలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పంపుతుందని, వివాదాలకు తావు లేకుండా కలిసికట్టుగా పని చేసేలా చర్యలు తీసుకుంటామని, అప్పటికి మారకపోతే కఠినంగా వ్యవహరిస్తామని పీసీసీ చీఫ్ తేల్చి చెప్పినట్లు తెలిసింది.


Similar News