Collector Abhilasha Abhinav : ఆధునిక పద్ధతిలో పంట సాగు చేస్తే అధిక లాభాలు
రైతులు ఆధునిక పద్ధతిలో పంటల సాగు చేస్తే అధిక దిగుబడులు
దిశ, పెంబి: రైతులు ఆధునిక పద్ధతిలో పంటల సాగు చేస్తే అధిక దిగుబడులు పొందుతారని జిల్లా కలెక్టర్ అన్నారు. నిర్మల్ పెంబి మండల కేంద్రంలో బుధవారం రోజున శ్రీ వెంకట సాయి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రారంభోత్సవం నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి వెలిగించి రైతుతో రిబ్బన్ కట్ చేయించి సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ, ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పంటలు సాగు చేసి, రైతులు అధిక దిగుబడులు సాధించాలని అన్నారు. రైతులు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మారుమూల ప్రాంతమైన పెంబి మండల కేంద్రంలో 350 మంది రైతుల సమిష్టి కృషితో ఉత్పత్తిదారుల సంస్థను స్థాపించడం అభినందనీయమని అన్నారు. ఈ సంస్థ ద్వారా 10 గ్రామపంచాయతీలలోని 18 హెబిటేషన్లలో దాదాపు 4 వేల మంది రైతులకు ఉపయోగపడుతుందని అన్నారు.
సంస్థకు అవసరమైన వసతులు కల్పించడంతోపాటు రైతుల అభివృద్ధికి వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు సూచనలు అందించాలని ఆదేశించారు. సంస్థలో మహిళా రైతుల భాగస్వామ్యం పెంచేలా కృషి చేయాలని సూచించారు. సంస్థ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని, రైతులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని లాభాలు సాధించాలని కోరారు. ప్రతి 3 నెలలకు ఒకసారి సంస్థ పురోగతిని పరిశీలించి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. అంతకుముందు సంస్థ అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల మేలు కోసం మారుమూల ప్రాంతంలో 350 మంది సభ్యులతో సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది తెలిపారు. భవిష్యత్తులో సంస్థ అభివృద్ధికి చేపట్టనున్న కార్యకలాపాలను ఆయన వివరించారు. అనంతరం మహిళా సభ్యురాలు సోంబాయిని కలెక్టర్ శాలువాతో సన్మానించారు. కలెక్టర్ చిత్రపటాన్ని గీసిన పుప్పాల నవిత ను అభినందించారు. మోహన్ అనే రైతు నాగలిని కలెక్టర్ కు బహుకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ విజయలక్ష్మి, నాబార్డ్ డిడి వీరభద్రుడు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రమణ, తాహసిల్దార్ లక్ష్మణ్, ఎంపీడీవో రమాకాంత్, అధికారులు, రైతులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.