Khanapur MLA : సంస్కృతి,సాంప్రదాయాలను కాపాడాలి
సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి
దిశ, ఉట్నూర్ : సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఖానాపూర్ నియోజకవర్గ( Khanapur MLA) ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. బుధవారం ఉట్నూర్ మండలంలోని మోతిరాం గూడా, దుర్గాపూర్, రాముగూడ, సాలెగూడ, గొట్టి, నర్సపూర్-(బి), పెందూర్ గూడా తదితర గ్రామాల్లో దండారి ఉత్సవాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎత్మాసూర్ దేవతకు పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ ధోతి కట్టుకుని గుస్సాడీలతో కలిసి చచ్చోయ్ కోలాటం ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తరాలుగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను మరువద్దని, యువత కొత్త సంస్కృతులను అవలంబించకూడదని సూచించారు. దండారి ఉత్సవాల్లో డీజేలను పెట్టొద్దని, ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు,కట్టుబాట్లు ఇతరులకు భిన్నంగా ఉంటాయనియన్నారు.
ప్రతి ఒక్క ఆదివాసి బిడ్డ తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. ఆదివాసీలకు దండారి ఒక గొప్ప పండుగ అని, ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ దండారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారని, ప్రభుత్వం దండారి ఉత్సవాల నిర్వహణకు ప్రతి దండారికి రూ. 15 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకు వస్తే, ఆ సమస్యల పరిష్కారం కోసం తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దుర్గాపూర్ దండారికి రూ. 15 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే గ్రామస్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పటేళ్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.