మంచిర్యాల జిల్లాలో హెచ్ఎంపీవీ లేదు

జిల్లాలో హెచ్ఎంపీవీ ప్రమాదం లేదని డీఎంహెచ్ఓ డాక్టర్ హరీష్ రాజు వెల్లడించారు.

Update: 2025-01-09 13:03 GMT

దిశ, మంచిర్యాల : జిల్లాలో హెచ్ఎంపీవీ ప్రమాదం లేదని డీఎంహెచ్ఓ డాక్టర్ హరీష్ రాజు వెల్లడించారు. కానీ ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ఆయన కోరారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ హెచ్ఎంపీవీ వైరస్ సోకితే సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కుదిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటీస్ నిమోనియా వంటి సమస్యలకు దారి తీయవచ్చని, సాధారణంగా వైరస్ సోకిన మూడు నుంచి ఆరు రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. పిల్లలు, వృద్దులు, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి వ్యాపిస్తుందని, హెచ్ఎంపీవీ వైరస్ ను నివారించాలంటే తరచూ సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. దగ్గు, తుమ్ముల సమయంలో నూటికి రుమాలు లేదా టవల్, టిష్యూ పేపర్ను తప్పకుండా అడ్డుపెట్టుకోవాలని, రద్దీగా ఉండే ప్రదేశాల్లో గుమి కూడకుండా ఉండాలని కోరారు.

    ఇంట్లో వెంటిలేషన్ అధికంగా ఉండేలా చూసుకోవాలని, అనారోగ్యంగా ఉంటే ఇంట్లోనే ఉంటూ ఇతరులతో సంబంధాన్ని పరిమితం చేసుకోవాలన్నారు. మోతాదులో నీళ్లు, పౌష్టికాహారాన్ని తీసుకోవాలని తెలిపారు. కళ్లు, ముక్కు, నోటిని తరచుగా తాకకూడదని, అనారోగ్యంతో ఉన్న రోగులతో కరచాలనం చేయరాదన్నారు. ఈ సూచనలు తీసుకున్నట్లయితే ప్రజలు భయాందోళనకు గురి కానవసరం లేదన్నారు. అదే విధంగా ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు ప్రజలను భయాందోళనకు గురి చేయరాదని, ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా వ్యాధులను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. కోవిడ్ అనుభవం ఉన్నందున జిల్లాలో ముందస్తు చర్యలు చేపట్టినట్టు చెప్పారు.

    మంచిర్యాల జిల్లాలోని 17 ఆరోగ్య కేంద్రాలు, 4 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, మాతా శిశు సంరక్షణ జిల్లా ఆసుపత్రి, సింగరేణి ఆసుపత్రులలో ముందస్తుగా చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఒక వెయ్యి 43 పడకలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్ బెడ్స్ ఏర్పాటు చేశామని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్సులతో పాటు మరో 18 అంబులెన్సులు సిద్ధంగా ఉంచామన్నారు. కళాజాతా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, ఆశ, ఆరోగ్య కార్యకర్తలకు వైద్య సిబ్బందికి అవగాహన కల్పించామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, డయాలజిస్ట్ సుమన్ పాల్గొన్నారు.  


Similar News