Adilabad MLA : జోగు రామన్న అబద్ధపు ప్రచారాన్ని మానుకోవాలి
గుజరాత్ లో పత్తి ధర రూ. 8800 ఉంటే ఆదిలాబాద్ లో ధర తక్కువగా
దిశ,ఆదిలాబాద్ : గుజరాత్ లో పత్తి ధర రూ. 8800 ఉంటే ఆదిలాబాద్ లో ధర తక్కువగా ఉన్నదని రైతులను తప్పుతోవ పట్టిస్తున్న మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ ధర కంటే రూ. 10 ఎక్కువగా ఉన్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సవాల్ చేశారు. పత్తి కొనుగోళ్లకు ప్రారంభం కంటే ముందు గుజరాత్ లో పత్తి క్వింటాల్ మద్దతు ధర రూ. 8800 ఉంటే ఆదిలాబాద్ లో ఎంపీ, ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఇక్కడి రైతులకు ఆ ధరను చెల్లించడంలో వీరు విఫలమయ్యారని జోగు రామన్న చేస్తున్న ఆరోపణలను పాయల్ శంకర్ ఖండించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జోగు రామన్న మాట్లాడుతున్న తీరును విమర్శించారు.
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాష్ట్ర మంత్రిగా పనిచేసిన దేశమంతా సీసీఐ ఒకే మద్దతు ధర ఉంటుందన్న విషయం ఆయన తెలుసుకోక పోవడం దురదృష్టకరమన్నారు. ఇకపోతే మద్దతు ధర కోసం పత్తి కొనుగోళ్ల మొదటి రోజే రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉన్నప్పటికీ, స్థానికంగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు మాత్రం పత్తాలేరని ఆరోపణలల్లో అర్థం లేదన్నారు. తాము స్థానికంగా లేకపోయినా విషయం తెలుసుకొని హుటాహుటిన హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు బయలుదేరామని తెలిపిన ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆదిలాబాద్ లోనే ఉన్న జోగు రామన్న.. రైతులు ఆందోళన చేస్తుంటే ఎందుకు రాలేదనీ ప్రశ్నించారు.ఆయన అబద్ధపు ప్రచారాలను మానుకోవాలని, రైతులను తప్పుదోవ పట్టించే ముందు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
ఇది ఇలా ఉంటే ఇన్నేళ్లుగా రాజకీయంలో ఉంటూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఒకసారి మంత్రి పదవి చేపట్టిన జోగు రామన్న కు రాజకీయంగా మాట్లాడే విధానం తెలియకపోవడం సిగ్గుచేటు అన్నారు. రాజకీయ విమర్శలు చేయాలి తప్ప.. భాష తప్పుదోవ పట్టకూడదని వ్యక్తిగత విషయాలకు వెళ్ళకూడదని కోరారు. అంతేకాకుండా పాయల శంకర్ జిన్నింగ్ వ్యాపారస్తులతో మాట్లాడి తన వాటా ఒప్పందం చేసుకున్నాడు.. తప్ప రైతులకు న్యాయం చేయడంపై దృష్టి సారించలేదన్న జోగు రామన్న గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన సమయంలో ఎవరి దగ్గర ఎంత వసూలు చేసే కూడగట్టుకున్నారో వాస్తవాలతో సహా నిరూపిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాజకీయంగా విమర్శలు చేయాలని, వ్యక్తిగత విమర్శలకు పోతే తాము, తమ కార్యకర్తలు కూడా ఆ విధంగా విమర్శలు చేస్తే జోగు రామన్న సమాజంలో తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు అయ్యన గారి భూమయ్య, ఆదిలాబాద్ ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.