Bhainsa: అయ్యో.. ఆదర్శ పాఠశాలకు ఉపాధ్యాయుడే లేడా..!

రిలీవర్ రాక ముందే ఉపాధ్యాయుడు రిలీవ్ అయ్యాడని.. దీంతో పాఠాలు చెప్పే వారు లేక విద్యార్థులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని కుబీర్ మండల పరిధిలని పార్డి‘కే’(చినపార్డి) గ్రామస్తులు వాపోతున్నారు.

Update: 2024-08-31 03:55 GMT

దిశ, భైంసా: రిలీవర్ రాక ముందే ఉపాధ్యాయుడు రిలీవ్ అయ్యాడని.. దీంతో పాఠాలు చెప్పే వారు లేక విద్యార్థులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని కుబీర్ మండల పరిధిలని పార్డి‘కే’(చినపార్డి) గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే, ఇటీవల బదిలీల్లో భాగంగా ఇక్కడ పని చేసే ఉపాధ్యాయుడు మరో చోటికి బదిలీ అయ్యాడు. అయితే, కొత్తగా చార్జ్ తీసుకునే వారు రాక ముందే ఉపాధ్యాయుడు రిలీవ్ అయ్యాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా, పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు లేకపోవడంతో ఇద్దరు ప్రైవేటు ఉపాధ్యాయులను నియమించుకుని బోధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. గతంలో జిల్లాలోనే ఆదర్శ పాఠశాలగా పేరు ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడం చూసి పలువురు నెవ్వరపోతున్నారు. అయితే, గ్రామంలో గతంలో నెలకొన్న ఓ సమస్యపై శుక్రవారం అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో కోమల్ రెడ్డి, ఎమ్మార్వో మోహన్ సింగ్, తదితరులు గ్రామానికి రాగా పాఠశాలలో ఉపాధ్యాయుడు లేని విషయాన్ని వారికి విన్నవించారు.

విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా: అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్

నాలుగు, ఐదు రోజుల్లో పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమించే విషయాన్ని కలెక్టర్ దృష్టి తీసుకెళ్తా. సమస్యను పరిష్కరించేందకు కృష్టి చేస్తా. గత ఉపాధ్యాయుడు పాఠశాలలో చార్జ్ తీసుకునే వారు రాకముందే ఎలా రిలీవ్ ఎలా అయ్యారనే విషయంపై డీఈవోను అడిగి తెలుసుకుంటా.

అలా రిలీవ్ అవ్వడం తప్పే: డీఈవో రవీందర్ రెడ్డి

జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉన్న మండలాల్లో కుబీర్ మొదటి స్థానంలో ఉంది. మండలంలో దాదాపు 50 పైనే ఉపాధ్యాయుల కొరత కొనసాగుతోంది. డీఎస్సీ ఫలితాల అనంతరం నూతన ఉపాధ్యాయులతో కొరత తీరనుంది. రిలీవర్ రాక ముందే ఉపాధ్యాయులు రిలీవ్ అవ్వడం తప్పే. వెంటనే అక్కడి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులను ఏర్పాటు చేస్తాం. రిలీవ్ ఎలా ఇచ్చారన్న విషయంపై సంబంధిత మండల విద్యాధికారిని అడిగి తెలుసుకుని చర్యలు తీసుకుంటాం.


Similar News