వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి..
ప్రభుత్వ వైద్యాధికారులు సకాలంలో స్పందించకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే దళిత బాలింత మృతి చెందిందని గ్రామస్తులు,
దిశ, ఇచ్చోడ : ప్రభుత్వ వైద్యాధికారులు సకాలంలో స్పందించకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే దళిత బాలింత మృతి చెందిందని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు శనివారం బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకుని మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ టెంట్ వేసి బైఠాయించారు.
కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని గోకొండ గ్రామానికి చెందిన రమ అనే గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో మూడు రోజుల క్రితం బజార్ హత్నూర్ పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత బాలింతకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో ఉన్న వైద్య సిబ్బంది ఏమాత్రం పట్టించుకోకపోవడంతో చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించామని చెప్పారు. ఆమెను పరిశీలించి రిమ్స్ వైద్యులు దారిలోనే బాలింత మృతి చెందిందని తెలిపారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బాలింత మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.