గ్రామాల్లో ఆర్ఎంపీల ఇష్టారాజ్యం.. అశాస్త్రీయ వైద్యంతో ప్రాణాలు హరీ!

పల్లె ప్రజల అమాయకత్వాన్ని ఆర్ఎంపీలు ఆసరాగా తీసుకుంటున్నారు.

Update: 2024-10-01 02:19 GMT

దిశ ప్రతినిధి నిర్మల్: పల్లె ప్రజల అమాయకత్వాన్ని ఆర్ఎంపీలు ఆసరాగా తీసుకుంటున్నారు. కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాల్సిన ఆర్ఎంపీ, పీఎంపీలు అలోపతి వైద్యం చదివిన ఎంబీబీఎస్ వైద్యుల కన్నా ఎక్కువగా వైద్యం చేసేస్తున్నారు. ఇలా చేయడం నేరమని తెలిసినప్పటికీ.. ఏమవుతుందిలే అనే ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వీరి ఆగడాలను కట్టడి చేయాల్సిన ఆరోగ్య శాఖ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా గ్రామాల్లో జ్వరం, దగ్గు వస్తే స్థానికంగా ఉండే ఆర్ఎంపీలు, పీఎంపీలను ఆశ్రయిస్తుంటారు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీలు, పీఎంపీల దగ్గర ఎంబీబీఎస్ వైద్యుల కన్నా ఎక్కువగా పేషెంట్లు కనిపిస్తుంటారు.

వరుస మరణాలతో కలకలం..?

తూర్పు మంచిర్యాల జిల్లాలో ఆర్ఎంపీ వైద్యుల అశాస్త్రీయ వైద్యం వల్ల ఇద్దరు మరణించారనే ప్రచారం జరుగుతోంది. లక్షెట్టిపేటలో పది రోజుల క్రితం ఓ యువకుడు జ్వరం వచ్చిందని ఆర్ఎంపీ దగ్గరకు వెళితే ఇంజక్షన్ ఇవ్వగా.. అది వికటించడంతో బ్రెయిన్ డెడ్ అయ్యింది. దీంతో మంచిర్యాల, హైదరాబాద్‌లో చికిత్స తీసుకుని పరిస్థితి విషమించి వారం క్రితం చనిపోయాడు. ప్రస్తుతం అదే తరహాలో నస్పూర్‌లో ఓ పీఎంపీ వైద్యం వికటించి ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. బాధిత కుటుంబం, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని నాగార్జున కాలనీకి చెందిన ఓ యువతి రెండు రోజులుగా జ్వరం రావడంతో స్థానికంగా ఉండే ఓ పీఎంపీ వద్దకు వెళ్లినట్లు చెబుతున్నారు.

సదరు పీఎంపీ పీసీఎం (పారసిటమల్) ఇంజక్షన్ వేయడంతో పాటు, మరో ఇంజక్షన్ వేయడంతో చలితో ఇబ్బంది పడింది. అంతలోనే వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె భర్త మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని తెలిసింది. పరీక్షలు చేసిన వైద్యులు పరిస్థితి విషమించిందని కరీంనగర్ తీసుకెళ్లమని సూచించారు. అక్కడి వైద్యులు తాము వైద్యం చేయలేమని, హైదరాబాద్‌కు తీసుకెళ్లమని తెలిపారు. అక్కడ వైద్య పరీక్షలు చేయగా బ్రెయిన్ డెడ్ అయ్యిందని డాక్టర్లు వివాహిత కుటుంబ సభ్యులకు తెలిపారు. రెండు వరస ఘటనలతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆర్ఎంపీ వైద్యులు ఇష్టారాజ్యంగా చేస్తున్న అశాస్త్రీయ వైద్యం కారణంగా ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పశ్చిమ జిల్లాలోనూ అడ్డగోలు దందా..

ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు పశ్చిమ ప్రాంతంలోని నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల్లోనూ అడ్డగోలుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. గ్రామాల్లో మామూలు జ్వరం వచ్చిన బాధితులకు వెంటనే ఫీవర్ ఇంజక్షన్‌తో పాటు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్, మరో స్టెరాయిడ్ ఇంజక్షన్ ఇచ్చేస్తున్నారు. ఇది పూర్తిగా అశాస్త్రీయ విధానం అని తెలిసినప్పటికీ ఆర్ఎంపీ వైద్యులు ఇవేమీ పట్టించుకోకుండా వైద్యం చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో నయం కావాల్సిన జ్వరం మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్‌తో కొత్త రోగాలకు దారితీసి పట్టణ ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలించే పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో కొన్ని సందర్భాల్లో రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏవైనా సంఘటనలు జరిగిన సమయంలో హడావిడి చేస్తున్న అధికారులు తరువా ఆ వ్యవహారంపై కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో గ్రామాల్లో ఆర్ఎంపీల దందా అడ్డూఅదుపు లేకుండా పోతోంది.

జిల్లా కలెక్టర్ హెచ్చరించినా..

తూర్పు ప్రాంతానికి చెందిన ఒక జిల్లాలోని 100 మంది ప్రాక్టీషనర్స్ వెళ్లి అక్కడి కలెక్టర్‌ను కలిశారు. టీజీఎంసీ దాడుల గురించి చెప్పుకున్నారు. గ్రామాల్లో తాము లేకపోతే ఆరోగ్య సమస్యలు విపరీతంగా తలెత్తి ప్రజారోగ్యానికి ఆటంకం కలుగుతుందని వివరించే ప్రయత్నం చేశారు. అయితే, అర్హత లేని వారు వైద్యం చేయకూడదని కలెక్టర్ చెప్పగా.. తమకు సంవత్సరాల తరబడి అనుభవం ఉందని ఆర్ఎంపీ వైద్యులు చెప్పినట్లు సమాచారం. వెంటనే ఆ కలెక్టర్ తన కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఆఫీస్ సబార్డినేట్‌ను పిలిచి మీ సర్వీస్ ఎంతో చెప్పండి అని కోరగా తనకు 30 ఏళ్ల అనుభవం ఉందని చెప్పినట్లు తెలిసింది. వెంటనే ఆ కలెక్టర్ ఆర్ఎంపీ వైద్యులతో మాట్లాడుతూ.. 30 ఏళ్ల అనుభవం ఉన్న ఆఫీస్ సబార్డినేట్ కలెక్టర్ కాలేదు కదా అని ముక్తసరిగా సమాధానం ఇవ్వడంతో ఆర్ఎంపీ వైద్యులు తెల్లముఖం వేసినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి గట్టి హెచ్చరిక చేసినప్పటికీ ఉమ్మడి జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీ వైద్య విధానంలో మార్పు రాకపోవడంపై భిన్న రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Similar News