దిశ, ఆదిలాబాద్ః రెండు రోజులుగా జిల్లాలో ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో ఉప్పొంగి ప్రవహిస్తున్న జైనధ్ మండలంలోని డోలారా పెన్ గంగా నీటి ప్రవాహాన్ని సోమవారం కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ గౌస్ ఆలంలు మండల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ప్రవాహ ఉధృతిని గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఇదే మండలంలో అతి భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న సందర్భంలో కామాయి గ్రామానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో జిల్లా కలెక్టర్, ఎస్పీ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలంలు సందర్శించి కామాయి గ్రామ మాజీ సర్పంచ్ తో ఫోన్ లో స్థానిక పరిస్థితి పై ఆరాతీశారు. రేషన్ కు సంబంధించి నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మెడిసిన్ అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు సురక్షితంగా ఉండేలా అన్ని సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలనీ ఆదేశించారు. అటు బేల మండలంలోని దేవూజి గూడ గ్రామంలో ఉరుములు , మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తున్న క్రమంలో గ్రామంలోని హనుమాన్ ఆలయంపై పిడుగు పడి గోపురం కింది బాగా దెబ్బతినగా గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఇదిలావుండగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు,నదులు, ప్రాజెక్టులు నిండుకుండలా మారి పరవళ్ళు తొక్కుతున్నాయి. దీంతో జిల్లాలోని పలు ప్రాజెక్ట్ ల గేట్లు ఎత్తివేయగా.. నది పరివాహక ప్రాంతంలోనీ పంట పొలాలు వందల ఎకరాలు వరద నీటిలో మునిగిపోగా.. రహదారులు నీటి ప్రవాహంతో కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరి కొన్ని ప్రాంతాల్లో వరద నిరు రోడ్లపైకి చేరడం రవాణా సౌకర్యం స్తంభించిపోయింది.