బాల్య వివాహాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు..
జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం అన్నారు.
దిశ, తాండూర్ : జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం అన్నారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో శుక్రవారం అదనపు ఎస్పీ అచ్చేశ్వరరావుతో కలిసి బాల్యవివాహాల నిర్మూలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వివాహాల ముహూర్తాల సమయం ఉన్నందువల్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామ, మండల, తాలూకా స్థాయిలో బాల్యవివాహాల నిషేధ చట్టం 2006 పైన పూర్తిస్థాయిలో రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, ఐసీడీఎస్ సిబ్బంది భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు.
చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేయాలన్నారు. మహిళా స్వయం సంఘాల ద్వారా గ్రామాల్లో పెద్ద ఎత్తున బాల్యవివాహాలతో జరిగే నష్టాన్ని వివరించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో బాల్యవివాహాలు జరిపించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా బాల్య వివాహాలు జరిపిస్తున్నట్లు తెలిస్తే చైల్డ్ లైన్ నెంబర్ 1098 సమాచారం ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సురేందర్, డీపీఓ రమేష్, డీడబ్ల్యూవో సావిత్రి, బాలల సంరక్షణ విభాగం సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.