పదో తరగతి పరీక్షలో ఘోర తప్పిదం.. హిందీ పేపర్ లీక్
పదవ తరగతి పరీక్షల్లో మొదటి రోజే గందరగోళం నెలకొంది.

దిశ, మంచిర్యాల : పదవ తరగతి పరీక్షల్లో మొదటి రోజే గందరగోళం నెలకొంది. శుక్రవారం నిర్వహించాల్సిన తెలుగు ప్రశ్నపత్రంకు బదులు హిందీ సెట్ ను తీసుకువచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో తెలుగు పేపర్ కు బదులుగా హిందీ పేపర్‌ను అందించారు. తెలుగు పేపర్ కు బదులు హిందీ ప్రశ్నపత్రాన్ని చూసి ఒక్కసారిగా అధికారులు అవాక్కయ్యారు. వెంటనే విద్యాశాఖ అధికారి యాదయ్యకు సమాచారం అందించారు. పాఠశాలకు చేరుకున్న డీఈఓ యాదయ్య కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
దీంతో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు జరగాల్సిన తెలుగు పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా నిర్వహించారు. అప్పటికే పలు రూముల్లో విద్యార్థులకు హిందీ ప్రశ్నపత్రం ఇచ్చిన సిబ్బంది తిరిగి వాటిని కలెక్ట్ చేసుకోవడంతో ప్రశ్నపత్రం లీక్ అయింది. దీనిపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తొలి రోజు తెలుగు పరీక్ష సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఆలీతో పాటు కస్టోడియన్ అధికారి పద్మజను విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.