హైడ్రాకు అదనపు బాధ్యతలు.. ఆల్రెడీ ఆదేశాలిచ్చేసిన రేవంత్ సర్కార్

హైడ్రా ఆక్రమణలను తేల్చుడు.. కూల్చుడు కాదు నీటివనరులు, చెరువులు, కుంటలను పరిరక్షించే బాధ్యతను సైతం తీసుకోనుంది.

Update: 2024-09-25 02:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : హైడ్రా ఆక్రమణలను తేల్చుడు.. కూల్చుడు కాదు నీటివనరులు, చెరువులు, కుంటలను పరిరక్షించే బాధ్యతను సైతం తీసుకోనుంది. దీనికి రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే హైడ్రాకు ఆదేశాలు సైతం జారీచేసింది. అయితే చెరువుల పూడికతీత, ఫెన్సింగ్ పనులను హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు చూస్తున్నారు. చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిని గుర్తించే బాధ్యతను రెవెన్యూ అధికారులు చూస్తున్నారు. కాగా హైడ్రాకు బాధ్యతలు అప్పగించేందుకు సంబంధించిన ఇంజినీర్ల కేటాయింపు ప్రక్రియ పురోగతిలో ఉంది.

112 ఎకరాల భూమి..

హైడ్రా ఏర్పడినప్పటి నుంచి 23 ప్రాంతాల్లోని 262 కట్టడాలను కూల్చివేసింది. అత్యధికంగా అమీన్‌పూర్ చెరువు పరిధిలో 51.78 ఎకరాల భూమి రికవరీ చేశారు. ఈ కూల్చివేతల నేపథ్యంలో 112 ఎకరాల భూమిని రికవరీ చేసింది. నల్లచెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు ఉంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు కలిపి 7 ఎకరాలు ఆక్రమణకు గురైందని అధికారులు గుర్తించారు.

ఇంజినీరింగ్ విభాగం..

హైడ్రాలో ఆయా విభాగాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా చెరువుల ఆక్రమణలను గుర్తించడానికి ఇప్పటికే రెవెన్యూ, ప్లానింగ్ విభాగాలకు అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. చెరువుల సుందరీకరణకు పనులు చేయడానికి అవసరమైన ఇంజినీరింగ్ విభాగాన్ని సైతం త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం కేటాయించిన 169 మంది ఆఫీసర్లు, 946 ఔట్ సోర్సింగ్ సిబ్బందిలో ఇంజినీరింగ్ విభాగానికి అధికారులు సైతం ఉన్నారని హైడ్రా అధికారులు చెబుతున్నారు.

పబ్లిక్ సెక్టార్ కంపెనీలకు..

ఒకపక్క చెరువులు ఆక్రమణకు గురవుతుంటే మరో పక్క జీహెచ్ఎంసీ అధికారులు చెరువులను ప్రయివేటు కంపెనీలకు అభివృద్ధిపేరుతో దత్తతకు ఇచ్చారు. మరిన్ని చెరువులను ఇవ్వడానికి స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. కార్పొరేట్, ప్రయివేటు కంపెనీలకు కాకుండా పబ్లిక్ సెక్టార్ కంపెనీలకు ఇస్తే న్యాయం జరుగుతుందని హైడ్రా అధికారులు భావిస్తున్నారు. రంగలాల్ కుంట చెరువును విర్టూస అనే కార్పొరేట్ కంపెనీకి అప్పగించారు. భగీరథమ్మ చెరువును సీఎస్ఆర్ కింద మీనాక్షి ఇన్ఫ్రాకు అప్పగించారు. ఈ రెండు చెరువులు కబ్జాకు గురయ్యాయి.

ఎన్ఆర్ఎస్ఏ నుంచి ఛాయా చిత్రాలు..

చెరువులకు సంబంధించిన పూర్వ సరిహద్ధులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ప్రవహించే మార్గాలు, కాలువులు, తూములు, అలుగులు ఎలా ఉన్నాయి. వాటి విస్తీర్ణం ఎంత ఉంది? అనే సమాచారాన్ని సేకరించడానికి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ(ఎన్ఆర్ఎస్ఏ) సహాయం తీసుకోనుంది. 2008లో చెరువులు, కుంటలు, నీటి వనరులకు సంబంధించిన ఛాయా చిత్రాలు ఎలా ఉన్నాయి? 2024లో ఎలా ఉన్నాయి? 16ఏండ్ల నాటి చిత్రాలను ఆధారంగా రెండింటి మధ్య తేడాను పరిశీలించాలని హైడ్రా నిర్ణయించింది. ఈ ఛాయా చిత్రాలకు ఎంత ఖర్చయిన ఫర్వాలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అభిప్రాయపడుతున్నారు.


Similar News