దిశ, తెలంగాణ బ్యూరో : అధునాతన సాంకేతికత దన్నుగా ఓఆర్ఆర్ లోపల విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణకు కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్ అన్నారు. గవర్నింగ్ బాడీ హైడ్రా కోసం ప్రత్యేక పాలసీ రూపకల్పన చేయనున్న నేపథ్యంలో సహకారం అందించేందుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం సచివాలయంలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్ బోర్డు, హైడ్రా, రెవెన్యూ, పోలీసు, అటవీ, అగ్నిమాపక శాఖ, మున్సిపాలిటీలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (ఓఆర్ఆర్ లోపల ఉన్న ఏరియా) పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలన్నీ పరిరక్షించే బాధ్యతలను హైడ్రా తీసుకుంటుందన్నారు. ఓఆర్ఆర్ లోపల అన్ని ప్రభుత్వ ఆస్తులకు జియో ట్యాగింగ్ చేపట్టాలన్నారు.
ఈ బాధ్యతను జీహెచ్ఎంసీ కమిషనర్ తీసుకోవాలన్నారు. ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై రంగారెడ్డి కలెక్టర్ శశాంక చైర్మన్ గా, 4 జిల్లాల కలెక్టర్ లు సభ్యులుగా కమిటీ వేస్తున్నట్లు పది రోజుల్లో కమిటీ నివేదిక సమర్పించాలని ముఖ్య కార్యదర్శి సూచించారు. అన్ని చెరువుల ఎఫ్టీఎల్ ను ఫైనలైజ్ చేసి పబ్లిక్ డొమైన్ లో ఉంచాలన్నారు. ఓఆర్ఆర్ లోపల ప్రకృతి విపత్తులు, ఆస్తుల పరిరక్షణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని హైడ్రాకు అందజేయాలని ముఖ్య కార్యదర్శి సూచించారు.
సమావేశంలో తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి రాకేశ్ మోహన్ డోబ్రియాల్, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్. రెడ్డి, రాచకొండ సీపీ సుధీర్ బాబు, జీహెచ్ఎంసీ కమిషనర్ కాట ఆమ్రపాలి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ , హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, హైదారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి కలెక్టర్లు అనుదీప్, శశాంక, గౌతమ్, వల్లూరు క్రాంతి, టీజీఎస్ఫీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, సైబరాబాద్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ తదితరులు పాల్గొన్నారు.