మున్సిపల్ చైర్ పర్సన్ భర్తకు ఏసీపీ ధమ్కీ.. బీఆర్ఎస్‌లో కేసుల దుమారం
నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేల ఆదేశాలను పక్కా పాటిస్తూ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బీఆర్ఎస్ పార్టీలో ముసలం రేపింది.
నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేల ఆదేశాలను పక్కా పాటిస్తూ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బీఆర్ఎస్ పార్టీలో ముసలం రేపింది. ఎమ్మెల్యే చెప్పాడని ఏకంగా అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ భర్తపై వరుసగా నమోదైన కేసులు ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా రాజకీయం షురూ అయింది. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఎమ్మెల్యే షకీల్ ఆమెర్‌కు వ్యతిరేకంగా అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ భర్త, కౌన్సిలర్ శరత్ రెడ్డి కత్తులు దూసే పరిస్థితికి దిగజారాయి.
ఈ విషయంలో బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త, కౌన్సిలర్‌కు ఇచ్చిన ధమ్కీ చర్చనీయాంశంగా మారింది. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే మున్సిపల్ చైర్ పర్సన్ భర్తకు నీవు నా హిట్ లిస్టులో ఉన్నావని జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది. గత రెండు సంవత్సరాలుగా చాప కింద నీరులా ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్ భర్త మధ్య ఉన్న విభేదాలు పోలీస్ కేసులతో పాటు ఏసీపీ వార్నింగ్ ఇచ్చే స్థాయికి దిగజారిపోవడంతో పార్టీకి అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో అధిష్టానం ఆలస్యంగా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : గత ఏడాది బోధన్ పట్టణంలో బీజేపీ అనుబంధ హిందూ సంఘాలు బోధన్ పట్టణ నడిబొడ్డున శివాజీ విగ్రహం ఏర్పాటుకు సంకల్పించాయి. గతంలోనే మున్సిపాలిటీలో శివాజీ విగ్రహం ఏర్పాటుకు తీర్మానం జరిగిన బీజేపీ బలపడుతుందని ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ దానిని అడ్డుకున్నాడని వాదనలున్నాయి. ఇది లా ఉండగా సంబంధిత శివాజీ విగ్రహం తయారుచేసి ఉంచిన రైస్ మిల్ శరత్ రెడ్డిది కాగా విగ్రహం ఏర్పాటు వెనుక మున్సిపల్ చైర్ పర్సన్ భర్త ఉన్నాడని గుర్తించిన షకీల్ ఆ అంశంపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
శివాజీ విగ్రహం ఏర్పాటు సందర్భంగా జరిగిన గొడవలు అల్లర్లకు సంబంధించి అందరి పైన కేసులు నమోదు కాగా శరత్ రెడ్డిపై కూడా కేసు నమోదు అయింది. నాటి నుంచి ఎమ్మెల్యే షకీల్ శరత్ మధ్య దూరం పెరిగింది. అదే సమయంలో మున్సిపల్ చైర్ పర్సన్ విధులను కత్తిరించడం ప్రోటోకాల్ పాటించకపోవడం లాంటి చర్యలు శరత్ రెడ్డిని బాధించాయి. అదే సమయంలో మున్సి పల్ కమిషనర్, వైస్ చైర్మన్ అంతా తామై నడిపిస్తున్నారని మున్సిపల్ చైర్మన్ పలు సందర్భాల్లో వాపోయారు. ఇటీవల కాలంలో ఫ్లెక్సీల రగడ ఇద్దరు మధ్య విభేదాలను మరింత రాజేసింది. ఈ నేపథ్యంలో పోలీసుల అధికారుల అత్యుత్సాహంతో ఇద్దరు మధ్య పూడ్చలేని గ్యాప్ ఏర్పడింది.
శరత్ రెడ్డికి బోధన్‌లో ఉన్న ఫాలోయింగ్‌తో పాటు కేసీఆర్ ఫ్యామిలీకి షకీల్ దూరం అయ్యారన్న వాదనలు లేకపోలేదు. గతంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్, డీసీసీబీ చైర్మన్ పదవులను ఆశించి ఎమ్మె ల్యే షకీల్ భంగపడ్డాడు. ఆ సమయంలో మైనార్టీ కోటాలో మంత్రి పదవిని ఆశించిన నెరవేరకపోవడంతో ప్రభుత్వ విప్ పదవిని ఆఫర్ చేసిన తిరస్కరించారు. బోధన్‌లో పరిస్థితులు లీడర్ల మధ్య ఫైట్‌తో దిగజారుతుండడంతో అధిష్టానం మంత్రి ప్రశాంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఆయన మంగళవారం ఉదయం ఎమ్మెల్యే షకీల్‌తో మాట్లాడారు. పోలీసుల వార్నింగ్‌తో శరత్ రెడ్డి హైదరాబాద్‌కు చేరి మంత్రికి పరిస్థితిని వివరించాడు. బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ లీడర్ల మధ్య ఫైట్ మంచిది కాదని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే శరత్ రెడ్డి ఎమ్మెల్యే షకీల్ కలిసి పని చేస్తారా లేదా అన్నది కాలమే నిర్ణయించనుంది.