Chamala: కవిత డీల్ యాక్టివ్ లేకపోవడం వల్లే ఆమ్ ఆద్మీ క్రౌడ్ ఫండింగ్: చామల
ఢిల్లీ సీఎం ఆతిశీ క్రౌడ్ ఫండింగ్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఖర్చులో కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ నేత ఆతిశీ (Delhi CM Atishi) క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించడంపై భువనగిరి ఎంపీ చామలకిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy ) విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌత్ గ్రూప్ (South Group) యాక్టివ్ గా లేనందువల్లే ఈ ఎన్నికల్లో ఆతిశీ క్రౌడ్ ఫండింగ్ కు వెళ్లారని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సౌత్ గ్రూప్ తరఫున ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో డీల్ చేశారని ఇప్పుడు ఆ డీల్ విచ్ఛిన్నం కావడంవల్ల ప్రజల వద్ద నుంచి చందాలు వసూలు చేస్తున్నారన్నారు. సౌత్ గ్రూప్ డీలింగ్ వల్లే గత గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఆమ్ ఆద్మీ రాజకీయం చేసిందని అక్కడ బీజేపీ అధికారంలో ఉందంటే దానికి కారణం కూడా సౌత్ గ్రూప్ డీలింగే నని విమర్శలు గుప్పించారు. ఢిల్లీ ఎన్నికల ఖర్చు రూ. 40 లక్షలు అవుతుందని క్రౌడ్ ఫండింగ్ చేయాలని ఆతిశీ కోరుతున్నారు. తాము గతంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెబుతున్నారు. కానీ గతంలో కవిత, సౌత్ గ్రూప్ లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అడ్డదారుల్లో ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.