బిగ్ న్యూస్: MLC కవిత కోసం రంగంలోకి స్పెషల్ టీమ్.. ఇప్పటికే ప్రశ్నల లిస్ట్ రెడీ చేసిన ఈడీ..?!
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో శనివారం ఉదయం 11 గంటలకు కవితను అధికారులు ఎంక్వైరీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏయే అంశాలపై ఆమె నుంచి సమాధానాలను రాబట్టాలనుకుంటున్న లిస్టును ఈడీ అధికారులు ఇప్పటికే రెడీ చేసుకున్నారు. ఇందుకోసం డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారులతో టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు ఈడీ వర్గాల సమాచారం. మనీ లాండరింగ్ కోణంపై ఈడీ అధికారులు ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నారు.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కవితకు సన్నిహితులుగా ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్లై, బోయిన్‌పల్లి అభిషేక్, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి తదితరులు ఇచ్చిన స్టేట్‌మెంట్లలో కవితకు ఉన్న ప్రమేయం గురించి ఇచ్చిన వివరాలపై ఈడీ ఆమెను లోతుగా ప్రశ్నించనున్నది. స్పెషల్ కోర్టుకు సమర్పించిన సప్లిమెంటరీ చార్జిషీట్‌లోని అంశాల చుట్టూ కవితను ప్రశ్నించడానికి ఈడీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. హవాలా మార్గంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చేరవేసిన ముడుపులు, లిక్కర్ వ్యాపారంలో లబ్ధి కలిగేలా పాలసీలో మార్పులు చేయాలన్న సంభాషణలు.. వీటన్నింటిలో కవిత ప్రమేయం గురించి ఆరా తీయనున్నది.
నిపుణులతో స్పెషల్ టీమ్ ఏర్పాటు
లిక్కర్ స్కామ్‌లో ఆర్థిక అంశాలే కాకుండా ప్రొసీజరల్ లాప్సెస్, ఎక్సయిజ్ పాలసీలో జరిగిన మార్పులు, హోల్‌సేల్- రిటైల్ బిజినెస్‌లో పరస్పర సహకారం, వివిధ కంపెనీల మధ్య బదిలీ అయిన డబ్బు తదితరాలన్నీ ముడిపడి ఉండడంతో ఆయా విషయాలపై అవగాహన ఉన్న అధికారులతో ఎంక్వయిరీ టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఎక్సయిజ్ రంగంలో అనుభవం ఉన్నవారిని, కంపెనీల స్థాపనకు సంబంధించిన కార్పొరేట్ వ్యవహారాలపై పట్టు ఉన్న అధికారులను, డిజిటల్ టెక్నాలజీ రంగానికి చెందిన నిపుణులను కమిటీలో నియమించినట్టు తెలిసింది.
కమిటీలో ఎంతమంది ఉంటారనేదానిపై ఈడీ వర్గాలు క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే ఈడీ వద్ద ఉన్న ఓరల్, డాక్యుమెంటల్, డిజిటల్ ఎవిడెన్సులను కవిత ముందు ప్రదర్శించి వాటికి తగిన తీరులో ఆమె నుంచి సమాధానాలు రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో పలు హోటళ్లలో చర్చలు జరిగినందున వాటికి సంబంధించిన సీసీ టీవీల వీడియో పుటేజీ, చార్టర్డ్ ఫ్లైట్‌ల వివరాలు, మొబైల్ ఫోన్ల ఐఎంఈఐ నంబర్లు, కాల్ డాటా తదితరాల ఆధారంగానూ కవితను క్రాస్ ఎగ్జామిన్ చేసి మరిన్ని వివరాలను తెలుసుకోవడంపైనే ఈడీ ఫోకస్ పెట్టే చాన్స్ ఉన్నట్టు తెలిసింది. గతేడాది సీబీఐ హైదరాబాద్‌కు వచ్చి కవితను ఆమె ఇంట్లోనే విచారించినప్పుడు వెల్లడించిన అంశాలను సైతం ఇప్పటికే ఈడీ తీసుకున్నట్టు సమాచారం.
సౌత్ గ్రూపు వ్యవహారంపైనే మెయిన్ ఫోకస్..
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలకమైన వ్యవహారమంతా సౌత్ గ్రూపు తరఫు నుంచే జరిగిందన్నది ఈడీ, సీబీఐ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ గ్రూపులో సభ్యులుగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ అరెస్టయ్యారు. శరత్ చంద్రారెడ్డి దీర్ఘకాలంగా జైల్లోనే ఉన్నారు. వారిద్దరి నుంచీ ఈడీ లోతైన వివరాలను సేకరించింది. స్పెషల్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టుల్లో కొన్నింటిని ఈడీ ప్రస్తావించింది. ఇక కవిత నుంచి ఇప్పుడు మరింత అదనపు సమాచారాన్ని ఈడీ రాబట్టనున్నది.
ఆమ్ ఆద్మీ పార్టీతో, ఢిల్లీ ఎక్సయిజ్ డిపార్టుమెంటుతో ఈ గ్రూపు తరపున కవిత పోషించిన పాత్రపైనే ఎంక్వయిరీలో ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నట్టు తెలిసింది. సౌత్ గ్రూపు తరఫున జరిపిన సంప్రదింపుల తర్వాత ఎవరి నుంచి ఎవరికి ఎంత ముడుపులు అందాయి.. వాటిని ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు.. వాటికి సంబంధించిన లెక్కలు.. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది.. దానికి ప్రతిఫలంగా ఎంత లబ్ధి చేకూరింది.. తదితర వివరాలను కవిత నుంచి రాబట్టనున్నారు.
ఈ విచారణలో ఆమె వెల్లడించే అంశాలను ఇప్పటికే పిళ్లయ్, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ ఇచ్చిన వివరాలతో ఈడీ ఆఫీసర్లు పోల్చి చూడనున్నారు. సౌత్ గ్రూపులో కవిత తరఫున బినామీగా ఉన్నట్లు పిళ్లయ్ ఒప్పుకోవడంతో సమీర్ మహేంద్రులో షేర్ హోల్డర్‌గా చేర్చడం.. ఇన్వెస్టుమెంటు పెట్టడం.. కిక్‌బ్యాక్ రూపంలో లావాదేవీలు జరగడం.. తదితరాలపై లోతుగా ఆరా తీయనున్నారు.
జాయింట్ ఎంక్వయిరీపై సందేహాలు
కవితను ఎంక్వయిరీకి రావాల్సిందిగా ఈడీ డేట్ ఫిక్స్ చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నదని ఈడీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూపు తరఫున ఇప్పటికే అరెస్టయిన అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ ఈడీ కస్టడీ ఈ నెల 13న ముగియనున్నది. సీబీఐ అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని వారం రోజుల పాటు మనీశ్ సిసోడియాను విచారించిన తర్వాత స్పెషల్ కోర్టు నుంచి అనుమతి పొందిన ఈడీ.. రెండు రోజుల పాటు ప్రశ్నించింది.
చివరకు గురువారం రాత్రి ఆయనను అరెస్టు చేసింది. సీబీఐ కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నందున దానిపై స్పెషల్ కోర్టు శుక్రవారం విచారణ జరపనున్నది. ఒకవేళ బెయిల్ మంజూరైనా ఈడీ మరో పిటిషన్ దాఖలు చేసి కస్టడీకి ఇవ్వాలని కోర్టును రిక్వెస్టు చేసే చాన్స్ ఉన్నది. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే ఈ నెల 13 వరకూ సిసోడియా, పిళ్లయ్ ఈడీ అదుపులోనే ఉండనున్నారు.
ఆ తేదీల్లో కవితకు కూడా నోటీసులు జారీచేసి విచారణ నిమిత్తం ఈడీ పిలిస్తే క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి చాన్స్ ఉంటుందనేది కూడా ఆఫీసర్ల ఆలోచన. కవితకు సంబంధించిన వ్యవహారాల్లో పిళ్లయ్ కీలకంగా ఉన్నందున అవసరమైతే వీరిద్దరినీ జాయింట్‌గా విచారించడానికి అవకాశాలు లేకపోలేదని ఈడీ వర్గాల సమాచారం. సిసోడియా సైతం ఆ సమయానికి ఈడీ అదుపులో ఉండే అవకాశాన్ని కొట్టి పారేయని ఆ వర్గాలు.. ముగ్గురినీ కలిపి కొన్ని అంశాల్లో విచారించడం, వారు వెల్లడించే సమాధానాలకు అనుగుణంకా క్రాస్ క్వశ్చన్లు వేసి వివరాలను రాబట్టే చాన్స్ ఉన్నదన్న అభిప్రాయాన్ని ఆ వర్గాలు వ్యక్తం చేశాయి.
మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50 దారుణం: కవిత
మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50 దుర్మార్గమైనదని, బాధితులను కూడా నిందితులుగా మారుస్తుందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో గురువారం రాత్రి మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ఈ సెక్షన్ రాక్షస స్వభావంతో కూడుకున్నదన్నారు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. మహిళలకు ఉన్న హక్కులను సైతం ఈడీ కాలరాస్తున్నదని ఆరోపించారు. విచారణకు హాజరుకావాల్సిన వ్యక్తి మహిళ అయినప్పుడు వారి ఇంటికే ఈడీ అధికారులు హాజరుకావాల్సి ఉంటుందని, కానీ తనను మాత్రం ఉద్దేశపూర్వకంగానే కార్యాలయానికి రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారని కవిత గుర్తుచేశారు.
ఇక్కడ రాజకీయ కక్షసాధింపు ధోరణి స్పష్టమవుతున్నదన్నారు. ఈడీ కార్యాలయానికి పిలిచి ఎంక్వయిరీ చేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో సుప్రీంకోర్టు పలు కేసులపై విచారణ సందర్భంగా మహిళలను వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించాలన్న ఉత్తర్వులు ఇచ్చినా దానికి బదులుగా ముఖాముఖి విచారణకు రావాల్సిందిగా ఈడీ ఆదేశించడంపై న్యాయపోరాటానికి ఆమె సిద్ధమవుతున్నట్టు తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు హాజరవుతానని, వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ తన దగ్గర ఉన్న సమాధానాలను ఇస్తానని అన్నారు.
తాను చెప్పగలిగింది మాత్రమే చెప్తాను తప్ప ఈడీ అధికారులు కోరుకున్న సమాధానాన్ని ఇవ్వలేనని చెప్పుకొచ్చారు. వారు సంతృప్తి చెందుతారా? లేదా? అనేదానితో తనకు సంబంధం లేదన్నారు. నిజానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై వస్తున్నవన్నీ ఆరోపణలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. విచారణకు హాజరైన తర్వాత తన సమాధానాలతో వారు సంతృప్తి చెందకుంటే ఏం చేసుకుంటారో చేసుకోవచ్చని అన్నారు. అంతకు మించి తాను చేయగలిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ బిడ్డ భయపడదు
ఈడీ విచారణకు హాజరవుతున్న కవితను అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ వర్గాల్లో అనుమానాలు బలంగానే ఉన్నాయి. ఇప్పటికే జంతర్‌మంతర్ దీక్ష కోసం వెళ్లిన తెలంగాణ జాగృతి, భారత్ జాగృతి కార్యకర్తలు, వలంటీర్లు ఢిల్లీ నగరంలో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. “కేసీఆర్ బిడ్డ భయపడదు.. ఫైటర్ కేసీఆర్ కూతురిగా ఎప్పుడూ బెదరదు.. బీజేపీ నుంచి ఇండియాను కాపాడండి.. మేమంతా కవితక్కతోనే ఉన్నాం..” అంటూ నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలను అభిమానులు నెలకొల్పారు. ఈడీ ఎంక్వయిరీకి కవిత వెళ్తున్న టైమ్‌లో ఢిల్లీలో ఈ పోస్టర్లు దర్శనమివ్వడం గమనార్హం.