న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా నివేదికను అందిస్తాం: డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్

కుల గణన పూర్తి వివరాలు వచ్చిన తర్వాత వాటన్నింటిని పరిగణనలోకి తీసుకుని బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా నివేదికను అందించే ప్రయత్నం చేస్తున్నామని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బి.వెంకటేశ్వర రావు అన్నారు.

Update: 2024-11-20 14:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కుల గణన పూర్తి వివరాలు వచ్చిన తర్వాత వాటన్నింటిని పరిగణనలోకి తీసుకుని బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా నివేదికను అందించే ప్రయత్నం చేస్తున్నామని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బి.వెంకటేశ్వర రావు అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కేటాయించేందుకు సమగ్రమైన నివేదిక ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. బుధవారం మసాబ్ ట్యాంక్ లోని డెడికేటెడ్ కమిషన్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి, బీసీ సంఘాల, బీసీ మేధావుల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ బృందం ఇప్పటివరకు ఐదు జిల్లాల్లో (ఉమ్మడి జిల్లాలు) పర్యటించి అక్కడి ప్రజలు, స్వచ్చంధ సంస్థలు, బీసీ కుల సంఘాలు, మేధావుల నుంచి సమాచారం తీసుకున్నామని ఆయన చెప్పారు. గురువారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బహిరంగ విచారణ నిర్వహిస్తున్నామని, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి లోని వారంతా తమ అభ్యర్థనలను కమిషన్ కు అందించవచ్చని ఆయన సూచించారు. జిల్లాలో ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుందని, అతి త్వరలో మిగతా జిల్లాలో పర్యటించి వివరాలు తెలుసుకుంటామని చైర్మన్ అన్నారు. తాము ఊహించిన దాని కన్నా ఎక్కువగా వినతిపత్రాలు వస్తున్నాయన్నారు. బుధవారం జరిగిన బహిరంగ విచారణకు బీజేపీ బీసీ సెల్ నాయకులు, వివిధ కుల సంఘాల నేతలు కమిషన్ ను కలిసి వినతి పత్రాలు అందించారు. జనాభా లెక్కల ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని వారు కోరారు.


Similar News