విద్యార్థులను వెంటాడుతున్న ర్యాగింగ్ భూతం.. చట్టాలు చెబుతున్నదేంటీ?
ఎన్నో ఆశలతో, మరెన్నో ఆశయాలతో కళాశాలల్లో చేరుతున్న విద్యార్థుల కలలు నెరవేరకుండానే విషాదాలుగా మిగులుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో ఆశలతో, మరెన్నో ఆశయాలతో కళాశాలల్లో చేరుతున్న విద్యార్థుల కలలు నెరవేరకుండానే విషాదాలుగా మిగులుతున్నాయి. కష్టపడి డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, ఉన్నతమైన స్థానాలలో నిలవాలనుకుంటున్న యువత ఆశలపై ర్యాగింగ్ భూతం నీళ్లు చల్లుతోంది. కళాశాలల్లో ర్యాగింగ్ పేరిట జరుగుతున్న వేధింపులు ఆత్మహత్యలకు దారి తీస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది.
ఇటీవల మెడికో ప్రీతి సూసైడ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చదవుతున్న దర్శన్ సోలంకి అనే విద్యార్థి సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రీతీ ఘటన అనేక సవాళ్లను మన ముందుచింది. ర్యాగింగ్ విషయంలో చట్టాలు కఠినంగా ఉన్నా కొంత మంది బెదరడం లేదు.
ర్యాగింగ్‌పై ఫిర్యాదులిలా..
దేశంలో ప్రసిద్ధి గాంచిన అనేక యూనివర్సిటీల్లో ర్యాగింగ్ భూతం కొనసాగుతూనే ఉంది. అయితే 2017లో యూజీసీకి మొత్తం 901 ర్యాగింగ్ ఫిర్యాదులు రాగా 2022 నాటికి ఇవి 1094కు చేరాయి. 2018- 2021 మధ్య కాలంలో ర్యాగింగ్‌పై యూజీసీకి మొత్తం 2790 ఫిర్యాదులు రాగా అందులో 47 శాతం కేసుల్లోనే చర్యలు తీసుకున్నారు. అందులో 17 సందర్భాల్లోనే నిందితులపై బహిష్కరణ వేటు పడిందంటే ఈ అంశంలో ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో స్పష్టమవుతోంది.
నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ర్యాగింగ్ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని దాని జోలికి వెళ్లొద్దని విద్యార్ధులకు వార్నింగ్ ఇచ్చారు. కానీ క్షేత్ర స్థాయిలో ఆ మేరకు చర్యలు కనిపించడం లేదు. ఏదో ఓ చోట ఘటన అనంతరం తేరుకుంటున్న ప్రభుత్వాలు అప్పటికప్పుడు హడావిడి చేసి తర్వాత లైట్ తీసుకుంటున్నాయి. ర్యాగింగ్ అంశంపై చిత్తశుద్ధితో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ముందుకు సాగితేనే ఫలితాలు ఉంటాయి.
చట్టాలేం చెబుతున్నాయి..
కోటి ఆశలతో విద్యాలయాల్లో అడుగుపెడుతున్న విద్యార్థుల ప్రాణాలను బలిగొంటున్న ర్యాగింగ్‌ను అరికట్టాల్సిందేనని, ఇందుకు కేంద్ర స్థాయిలో సమగ్ర ర్యాగింగ్ వ్యతిరేక చట్టాన్ని రూపొందించాల్సిన అవసరముందని రాఘవన్ కమిటీ గతంలో సిఫార్సు చేసింది. ర్యాగింగ్ సంబంధిత నేరాలను భారత శిక్షాస్మృతిలో చేర్చాలని సూచించింది. ర్యాగింగ్‌ను బెయిల్‌కు అనర్హమైన నేరంగా పరిగణించాలి.
కఠిన చర్యలుంటేనే సీనియర్ల ముసుగులో చెలరేగిపోతున్న వికృత నేరగాళ్లకు కళ్లెం వేసే అవకాశం ఉంటుంది. ఆయా మాధ్యమాలు, సినిమాల్లో ర్యాగింగ్ చేయడాన్ని చూపడం మానాల్సి ఉంది. సినిమాల ప్రభావం యువతపై అధికంగా ఉండటంతో చాలా మంది వాటిని అనుకరిస్తూ పెడదారి పడుతున్నారు.
ర్యాగింగ్ విషయంలో నేరుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. లేదా యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ నంబర్ 1800 180 5522 కు కాల్ చేయొచ్చు. ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ 2011 ర్యాగింగ్ నేరమని స్పష్టం చేస్తోంది. దీంతో పాటు (ఐపీసీ) 294, 232,339,340,506 సెక్షన్ల ప్రకారం శిక్షార్హులు. అయితే ర్యాగింగ్ విషయంలో సీనియర్లకు బెనకకుండా ధైర్యంగా ముందడగు వేసే బాధ్యత మాత్రం విద్యార్థులదే.