సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థిక వేత్త భేటీ.. పదేళ్ల అప్పులపై చర్చ

సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థిక వేత్త, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా భేటీ అయ్యారు.

Update: 2024-02-03 13:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థిక వేత్త, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా భేటీ అయ్యారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో అహ్లువాలియా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, గడిచిన పదేళ్లలో భారీగా పెరిగిన అప్పులు, వాటి ప్రభావంపై వీరు చర్చించారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో అనుసరించిన ఆర్థిక సంస్కరణలు, వివిధ అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.

కాగా గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసిందంటూ ఇటీవల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి సర్కార్ శ్వేత పత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఈ నేఫథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించగా మరోవైపు కాంగ్రెస్ హామీలు అమలు చేయడం సాధ్యం కాదంటూ ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చిచెబుతున్నారు. ఇటువంటి తరుణంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో మాటెక్ సింగ్ అహ్లువాలియా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ప్రారంభంలో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంతో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సైతం భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికలకు ముందు వరుసగా ఆర్థిక వేత్తలు ప్రభుత్వ పెద్దలతో సమావేశం అవుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.

Tags:    

Similar News