భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థినిల మృతిలో కొత్త ట్విస్ట్..
భువనిగిరి లోని ఎస్సీ బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలాన్ని సృష్టిస్తోంది.
దిశ డైనమిక్ బ్యూరో: భువనిగిరి లోని ఎస్సీ బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలాన్ని సృష్టిస్తోంది. భువనగిరి లోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఉంటూ భువనగిరి పట్టణం లోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న హైదరాబాద్ లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) తమను వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్‌లో ఉంటున్న నలుగురు 7వ తరగతి విద్యార్థినులు వార్డెన్ కు ఫిర్యాదు చేశారు.
దీనితో వారిని వార్డెన్ మందలించింది. అలానే వాళ్ళ ఇళ్లకు ఫోన్ చేసి చెప్పింది. ఈ నేపథ్యంలో తాము చెయ్యని తప్పుకు అందరి ముందు నిందించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు.. వారి ఇద్దరి మృతదేహాలను ఒకే దగ్గర సమాధి చెయ్యాలని.. అదే వారి చివరి కోరికని..అలానే వాళ్ళ హాస్టల్ వార్డెన్ ను ఏమి అనవద్దని.. తాను వాళ్ళను కన్న తల్లి కంటే బాగా చూసుకున్నారని విద్యార్థినిలు రాసిన సూసైడ్ నోట్ దొరికింది.
కానీ ఎవరు ఊహించని విధంగా ఈ విద్యార్థినుల మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. అసలు విధ్యార్ధినిలది హత్యనా..? ఆత్మహత్యనా..? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. బాలికల మృత దేహాలపై పంటి గాట్లు, వాతలు ఉండడం ఇరువురి బాలికల కుటుంబ సభ్యులు గమనించారు. అరా తియ్యగా బాలికల హాస్టల్ లోకి వచ్చిన కొందరు ఆటో డ్రైవర్ లు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తమకు తెలిసిందిని బాలికల కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.
తమ పిల్లలను హత్యా చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వార్డెన్, పిఈటి, ఆటో నిర్వాహకులు ఆంజనేయులు, వంట మనిషిని విచారించి వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలానే పోస్టుమార్టం రిపోర్టును, పోలీసులు పంచానామాను బయటపెట్టాలని కోరుతూ భువనగిరి పట్టణం లోని ఎస్సీ బాలికల హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీనితో హాస్టల్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన హాస్టల్ దగ్గరకి చేరుకున్నారు.