Sajjanar : కన్నీళ్లకే కన్నీళ్లు తెప్పించే హృదయవిదారక సంఘటన! ఎండీ సజ్జనార్ ఎమోషనల్ ట్వీట్
హైదరాబాద్‌లోని నాగోల్‌లో దయనీయమైన ఘటన చోటుసుకుంది. అంధులైన వృద్ధ దంపతులు కొడుకు చనిపోయడని గ్రహించలేకపోయారు.
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని నాగోల్‌లో దయనీయమైన ఘటన చోటుసుకుంది. అంధులైన వృద్ధ దంపతులు కొడుకు చనిపోయడని గ్రహించలేకపోయారు. నాగోల్ పరిధిలోని జైపురి కాలనీలో నివాసం ఉండే రమణ, శాంతకుమారి అనే వృద్ధ దంపతులకు ఇద్దరు కుమారులు, పెద్ద కొడుకు ప్రదీప్ వేరే కాపురం పెట్టగా చిన్న కుమారుడు ప్రమోద్‌కు పెళ్లైన భార్య విడిచి గత నాలుగేళ్లుగా తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల మద్యం సేవించి ఇంటికి వచ్చి నిద్రలోనే మరణించాడు. కానీ ప్రమోద్ మరణించిన విషయం తల్లిదండ్రులకు తెలియదు. అంధులు కావడంతో వారికి కనిపించలేదు. మూడు రోజుల తర్వాత శరీరం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు నాగోల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగానే, సీఐ సూర్యనాయక్ మనసు ద్రవించింది. బిక్కుబిక్కుమంటున్న ఆ వృద్ధ దంపతులకు సపర్యలు చేసి ఆయన ఆహారం అందించారు. ఈ ఘటన నగర వాసులతో పాటు అందరి హృదయాల్ని కదిలించింది. ఈ ఘటనపై బుధవారం ఎక్స్ వేదికగా టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు.
కన్నీళ్లకే కన్నీళ్లు తెప్పించే హృదయవిదారక సంఘటన అని TGSRTC MD V.C. Sajjanar సజ్జనార్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. హృదయం కన్నీళ్లతో తడిసి ముద్దవుతున్న హేయమైన ఘటన ఇది అని పేర్కొన్నారు. మాయమవుతున్న మనిషితత్వానికి మాయని మచ్చ ఇదని, ఇలాంటి మనుషుల మధ్యన మనం కూడా మనుగడ సాగిస్తున్నామా.. అనే అనుమానం కలుగుతోందన్నారు. అంగారక గ్రహం మీద కూడా అడుగు పెట్టాలనుకుంటున్న మనిషి.. పక్క మనిషి బాధల్లోకి, మనుసుల్లోకి తొంగి చూడలేకపోవడం బాధాకరమన్నారు. ఎక్కడికి ఈ పరుగు.. ఎక్కడికి ఈ గమ్యంలేని పయనం.. నాలుగు రోజులు తిండి నీళ్లు లేకుండా ఆకలికి అలమటించిన ఆ వృద్ద దంపతులకు కాదు చూపులేనిది, మనకే, మన సమజానికే. మనిషి - స్పందించు.. అని ట్వీట్ చేశారు.