డ్రమ్ములో లభ్యమయిన డెడ్ బాడీ.. వివాహితతో లవ్ ఎఫైర్ కారణమా?
సూరం చెరువులో ఓ డ్రమ్ములో 30 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
దిశ, బడంగ్పేట్ : సూరం చెరువులో ఓ డ్రమ్ములో 30 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో పహాడీషరీఫ్ పోలీసుల దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్ళికి మునుపే పురన్సింగ్కు యూపీకి చెందిన మరో వివాహితతో లవ్ ఎఫైర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సదరు వివాహిత భర్త, పిల్లలను వదిలి హైదారాబాద్‌కు రావడంతో ఆమె అత్తింటి వాళ్లు పురన్సింగ్ను చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలలోకి వెళితే ...
సంచలనం సృష్టించిన సూరం చెరువు డ్రమ్ములో లభ్యమైన 30 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఘటనలో మిస్సింగ్ కేసు ఆధారంగా బండ్లగూడ పటేల్ నగర్‌కు చెందిన పురన్ సింగ్ (30) గా పహాడిషరీఫ్ పోలీసులు గుర్తించారు. ఉత్తర్ ప్రదేశ్ ఉరయ్ గ్రామానికి చెందిన పురన్సింగ్కు ఘోరక్పూర్ వికలాంగురాలు మమతాదేవితో ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లోనే వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. కృష్ణ (4), ప్రవీణ్‌కుమార్‌లు ఉన్నారు.
పురన్సింగ్కు ఓ వివాహితతో లవ్ ఎఫైర్?
పురన్సింగ్కు పెళ్లికి మునుపే అయితే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇది వరకే వివాహం జరిగి, ఇద్దరు పిల్లలు ఉన్న వివాహితతో ప్రేమ వ్యవహారం కొనసాగినట్లు తెలుస్తుంది. అక్కడ పురన్ సింగ్ కోసం వివాహిత అత్తింటి వారితో గొడవలు జరిగినట్టు సమాచారం. ఐదేళ్ళ క్రితమే హైదరాబాద్‌కు వచ్చిన గప్‌చుప్‌ల బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్న పురన్సింగ్కు మమతా దేవితో వివాహం జరిగాక బండ్లగూడ పటేల్నగర్లోనే నివసిస్తున్నాడు. పెద్దకుమారుడు కృష్ణ జన్మించాక సదరు వివాహితతో పురన్సింగ్కు గొడవలు ప్రారంభమయ్యాయి.
అప్పట్లో యూపీలో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పురన్సింగ్పై సదరు వివాహిత అత్తగారు ఫిర్యాదు చేశారు. ఇది ఇలా ఉండగా తనను పెళ్ళి చేసుకోమంటే మరో యువతిని ఎలా పెళ్ళి చేసుకుంటావా అని లాక్ డౌన్ సమయంలో సదరు యువతి హైదరాబాద్‌కు వచ్చి పురన్సింగ్తో గొడవకు దిగింది. తన భర్తను, ఇద్దరు పిల్లలను వదిలి వచ్చానని తనను పెళ్ళి చేసుకోవాలని తీవ్ర ఒత్తిడి చేసింది. దీంతో పురన్సింగ్ ఇప్పుడు నాకు పెళ్లయిందని, వికలాంగురాలితో వివాహం జరిగిందని, తనను వదిలేయాలని ప్రాధేయపడినట్లు తెలుస్తోంది. అనంతరం వీరిమధ్య జరిగిన ఒప్పందంలో సదరు వివాహిత కూడా అప్పటి నుంచి కాటేదాన్ ప్రాంతంలోనే ఓ గది అద్దెకు దిగి ఇక్కడే నివసిస్తున్నట్లు సమాచారం.
నా కొడుకు సంసారంలో నిప్పులు పోస్తావా? నిన్ను బ్రతకనీయమని గత కొన్ని రోజులుగా సదరు వివాహిత అత్తగారు పురన్సింగ్ను హెచ్చరించడం ప్రారంభించారు. ఈ నేపధ్యంలోనే పురన్సింగ్ ఈ నెల22వ తేదీన కనిపించకుండా పోయాడు. పురన్సింగ్ ఈ నెల 25వ తేదీన తుక్కుగూడలోని సూరం చెరువులో ఓ డ్రమ్ములో తలక్రిందులుగా తరహాలో మృతదేహం లభ్యమయ్యింది. కేసును నమోదు చేసుకున్న పహాడీషరీఫ్ పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే పురన్సింగ్ హత్య సదరు వివాహిత అత్తగారే చేశారా? ఇంకా ఎవరైనా చేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పురన్సింగ్ను ఎప్పుడు? ఎక్కడ ?ఎలా? ఎవరు? హత్య చేశారు? అనే అంశాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.