మోగుతున్న ముందస్తు సైరన్

సర్కారు పరుగులు తీస్తున్నది. సీఎం కేసీఆర్​ వరుస రివ్యూలు పెడుతున్నారు.

Update: 2022-12-02 02:49 GMT

సర్కారు పరుగులు తీస్తున్నది. సీఎం కేసీఆర్​ వరుస రివ్యూలు పెడుతున్నారు. జిల్లాల టూర్లకు ప్లాన్​ చేశారు. పనులు పూర్తి కాకున్నా ప్రభుత్వ భవనాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఏళ్లుగా పంపిణీకి నోచుకోని డబుల్​ బెడ్​రూం ఇండ్లకు లబ్ధిదారులకు అప్పగించేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. పథకాల అమలులోనూ స్పీడ్​ పెరిగింది. మంత్రులూ అదే పనిలో బిజీ బిజీగా ఉన్నారు. ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారుల బదిలీకి రంగం సిద్ధం అవుతున్నది. ఇప్పటికే ఆ జాబితాలను సీఎస్​ రెడీ చేశారని తెలుస్తున్నది. అయితే, మునుగోడు ఉప ఎన్నిక నుంచి స్తబ్దుగా ఉన్న సర్కారు.. ఒక్కసారిగా రయ్​మని దూసుకుపోవడం ముందస్తు ఎన్నికల కోసమేనా? అన్న ఊహాగానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: నిన్నటివరకు నత్తకు నడకలు నేర్పిన ప్రభుత్వ యంత్రాంగం ఉన్నట్టుండి ఉసేన్​బోల్ట్​ రేంజ్‌లో పరుగులు తీస్తున్నది. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు..పెండింగ్ పనుల పూర్తి.. ఇలా అన్ని పనుల్లో వేగం పెరిగింది. ఇంతకాలం కూల్‌గా కనిపించిన పాలన యంత్రాగంలో ఒకేసారి హడావుడి నెలకొంది. వరస రివ్యూలు పెడుతూ సీఎం కేసీఆర్ పాలనపై ఫోకస్ పెట్టారు. మంత్రులు కూడా తమ శాఖ పరిధిలోని పనుల్లో వేగం పెంచారు. దీంతో ఎన్నికల హడావుడి వచ్చిందని టాక్ మొదలైంది. మునుగోడు ఉప ఎన్నికల పూర్తయ్యే వరకు సైలెంట్‌గా ఉన్న ప్రభుత్వంలో ఒకేసారి సందడి నెలకొంది. ఈ సందడి ఎన్నికల షెడ్యూలు వచ్చే వరకు ఇలాగే కొనసాగవచ్చని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

వరుసగా జిల్లా టూర్లు..

డిసెంబర్‌లో సీఎం కేసీఆర్ ఎక్కువ కాలం జిల్లా టూర్లు, ప్రారంభోత్సవాలపై ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. ఈ నెల 4న మహబూబ్​నగర్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 7న జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. ఈ నెల 9న రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు పొడిగించనున్న మెట్రో రైలు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 11 లేదా 12 తేదీల్లో మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు.

జనవరి 18న సెక్రటేరియట్..

వచ్చే నెల 18న కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజు తెలంగాణ అమర వీరుల స్మారక భవనాన్ని అందుబాటులోకి తెస్తారు. సెక్రటేరియట్‌లో నిర్మాణ పనులు పెండింగ్‌లోనే ఉన్నా.. మంచి ముహుర్తం ఉండటంతో ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఇప్పటికైతే సీఎం కార్యాలయం ఉండే 6వ అంతస్తు మాత్రమే పూర్తి అయింది. మిగతా పనులు పూర్తవడానికి మరో ఆరు నెలల టైమ్ పడుతుందని అధికారులు చెప్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల హామీల్లో భాగంగా ఇంటింటికీ కంటి పరీక్షలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకు ఆ హామీపై దృష్టి పెట్టని సర్కారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కంటి పరీక్షలు చేసేందుకు సిద్ధమైంది. జనవరి 18న ప్రారంభించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా యుద్దప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతి ఇంటికి వెళ్లి కంటి పరీక్షలు చేసి, సమస్యలు ఉన్న వారికి అద్దాలు పంపిణీ చేయనున్నారు.

డబుల్ ఇండ్ల పంపిణీ..

2014 నుంచి ఇంతవరకు డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ పూర్తిచేయలేదు. కానీ ఈసారి మాత్రం పూర్తయిన ఇండ్లను పంపిణీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నది. ఇప్పటివరకు పూర్తయిన ఇండ్లను పంపిణీ చేసేందుకు లబ్దిదారులను డ్రాలో ఎంపిక చేయాలని, ఇందుకోసం డిసెంబర్​ చివరి వారంలో గ్రామ సభలు నిర్వహించాలని ఆలోచిస్తున్నది. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే రిపేర్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం త్వరలో టెండర్లు పిలువనున్నారు. ఇతర పనులకు కాస్త ఆలస్యమైన రోడ్ల రిపేర్ల కోసం నిధుల లోటు లేకుండా చూడాలని ఆఫీసర్లకు ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది.

ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. బుధవారం హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్‌గా ఉన్న రంగనాథ్‌ను వరంగల్ సీపీగా నియమించారు. త్వరలో కొత్త డీజీపీ నియామకం కూడా జరుగనున్నది. అంతకంటే ముందే చాలాకాలంగా ఒకే స్థానంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బదిలీల జాబితాను సీఎస్ సోమేశ్ కుమార్ సిద్ధం చేసినట్టు తెలిసింది.

Read more:

కవిత ఇష్యూలో ఈడీ సీరియస్.. అందుకే ఆమె జైలు వెళ్లడానికి సిద్ధమైందా..?

TRS ఉక్కిరి బిక్కిరి.. మంత్రులు, లీడర్లలోనూ భయం భయం....కవిత ప్రకటనతో మరింత గందరగోళంలోకి గులాబీ శ్రేణులు

Tags:    

Similar News