ఇంటింటి సర్వేలో 80 వేల మంది.. సర్వేలో పాల్గొననున్న 39,973 మంది టీచర్లు
రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి సమగ్ర సర్వేకు సర్వం సిద్ధమైంది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి సమగ్ర సర్వేకు సర్వం సిద్ధమైంది. ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న సోషియో, ఎడ్యుకేషనల్, ఎకనామిక్, ఎంప్లాయిమెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే లో 80వేల మంది సేవలను వినియోగించుకోవాలని సర్కారు నిర్ణయించింది. అయితే, దీంట్లో ప్రధానంగా స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రైమరీ స్కూల్ టీచర్లు, హెడ్మాస్టర్లు ఎక్కువగా ఉన్నారు. దీంట్లో దాదాపు 40వేల మంది ఎస్జీటీ, పీఎస్హెచ్ఎంలు ఉన్నారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 6 నుంచి మూడు వారాల పాటు సర్వే నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సర్వేలో విద్యాశాఖ పరిధిలోని ప్రైమరీ స్కూల్ టీచర్లతో పాటు ఎంఆర్సీ సిబ్బంది, ఎయిడెడ్ నాన్ టీచింగ్ సిబ్బంది సేవలను వినిగియోచుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మొత్తం 80 వేల మందిలో మెజార్టీగా టీచర్ల సేవలను వినియోగించుకుంటామని,వారితో పాటు ఎమ్మార్వో, ఎండీవో, ఎంపీవో సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్ల సేవలను వినియోగించుకోనున్నట్టు తెలిపారు. అయితే, స్కూళ్లలో బోధనకు ఇబ్బంది జరగకుండా జరగకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో మొత్తం 36559 మంది ఎస్జీటీలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లు పాల్గొననున్నారు. దీంతో పాటు 6,256 మంది ఎంఆర్సీ సిబ్బంది, 2వేల మంది సర్కారు, జడ్పీ/ఎంపీపీ స్కూళ్సలోని సిబ్బంది, ఎయిడెడ్ స్కూళ్లలోని మినిస్టీరియల్ సిబ్బందిని వినియోగించుకుంటామని అధికారులు ప్రకటించారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే స్కూళ్లు కొనసాగనున్నాయి. అయితే, యూపీఎస్, హైస్కూళ్లలో పనిచేస్తున్న ఎస్జీటీలకు ఈ సర్వే నుంచి మినహాయించినట్టు అధికారులు ప్రకటించారు.