ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు రూ.5 వేల కోట్లు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు తొలి ఏడాదే ఐదు వేల కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Update: 2024-08-26 17:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు తొలి ఏడాదే ఐదు వేల కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. చరిత్రలో తొలిసారి విద్యకు సంబంధించిన అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో ఎవరు ఆలోచన చేయని విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు ఏర్పాటు దిశగా ముందుకు వెళుతుందని వెల్లడించారు. సచివాలయంలో సోమవారం యూపీఎస్సీ మెయిన్స్ కి ఎంపికైన వారికి సింగరేణి తరఫున ప్రోత్సాహకంగా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్ కు కేవలం ఏడాదికి రూ.3 కోట్లు మాత్రమే మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు చేసిందని, ఈఏడాది 3 కోట్ల నుంచి రూ.5 వేల కోట్లకు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిందన్నారు. ఈ కేటాయింపులే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుందన్నారు. అంగన్వాడీలు, హయ్యర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీల వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందన్నారు. యూనివర్సిటీలో ఉన్న సిలబస్, పరిశ్రమల అవసరాలకు సంబంధం ఉండడం లేదని, అంతేకాక గ్లోబలైజేషన్ జరుగుతున్న ఈ పరిస్థితుల్లో.. పరిశ్రమలకు అవసరమైన సిలబస్ ను తయారు చేసే పనిలో భాగంగా చరిత్రలో తొలిసారిగా స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. ఈ స్కిల్ యూనివర్సిటీలో పరిశ్రమలకు సంబంధించిన గొప్ప వారిని భాగస్వాములుగా చేస్తూ.. ఆనంద్ మహేంద్రా ను చైర్మన్ గా నియమిస్తూ.. వారు రూపొందించిన సిలబస్ ని బోధించి విద్యార్థులను సాంకేతిక నైపుణ్యపరంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని దాదాపు 63 ఐటీఐ కళాశాలలు మూసివేత దిశలో ఉన్నాయని, వాటికి కొత్త జవసత్వాలు కల్పించేలా అడ్వాన్స్డ్ స్కిల్ సెంటర్లుగా అప్డేట్ చేస్తున్నామన్నారు. దేశంలో ప్రఖ్యాతిగాంచిన టాటా, ఇతర ముఖ్యమైన పరిశ్రమలను ఇందులో భాగస్వాములుగా చేస్తూ ఐటీఐలను స్కిల్ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని మానవవనరులను పెద్ద ఎత్తున ప్రోత్సహించి.. తద్వారా రాష్ట్ర, దేశాభివృద్ధికి దోహదం చేసేలా కార్యక్రమాలను రూపొందించేలా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు.

యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాసై మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వారిని అభినందించి, ఆర్థిక ప్రోత్సాహకాలని అందించేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్రంలోని మేధో సంపత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా ప్రజా ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించిన వారెవరు ఆలోచించని విధంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గం మొత్తం ఆలోచన చేస్తోందన్నారు. రాష్ట్రం నుంచి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులంతా ఉత్తీర్ణులై ఈ రాష్ట్రానికి ఈ దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి యూపీఎస్సీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు లక్ష రూపాయల ఆర్థిక సహకారం అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర ఎనర్జీ శాఖను, సింగరేణి కాలరీస్ సంస్థను ప్రత్యేకంగా అభినందించారు. 


Similar News