ఏజెన్సీ ప్రాంతాల్లో 4 కొత్త ఆస్పత్రులు!
ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో రోగులను కేవలం 30 నిమిషాల్లోనే హాస్పిటల్స్ కు చేర్చాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో రోగులను కేవలం 30 నిమిషాల్లోనే హాస్పిటల్స్ కు చేర్చాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మన్ననూరు, భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో కొత్త హాస్పిటల్స్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని రకాల వైద్యసేవలతో ఎస్టాబ్లిష్ చేయాలని ముందుకు వెళ్తోంది. వెంటనే ప్రతిపాదనలు ఇవ్వాలని ఐటీడీఏ పీవోలకు ఆదేశాలిచ్చింది. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఐటీడీఏల పరిధిలోని అన్ని హాస్పిటళ్లలో సౌకర్యాలు కల్పిస్తుండగా, త్వరలో కొత్త హాస్పిటల్స్ ను అందుబాటులోకి తేనున్నారు. దీంతో అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ,అరగంట లోపలే ఐటీడీఏల పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లకు చేరుకుంటారు. ఇదో నెట్ వర్క్ తరహాలో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం సబ్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ను వీలైనంత ఎక్కువగా అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
ఐటీడీఏ పరిధిలో ఉన్న జిల్లా, ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు మొదలు పెట్టారు. అటవీ ప్రాంతాలు, రోడ్డు కనెక్టివిటీ సరిగా లేని ప్రాంతాల్లోని గర్భిణులను ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ (ఈడీడీ) కంటే ముందే హాస్పిటల్స్‌కు తరలించి, బర్త్ వెయిటింగ్ రూమ్స్‌లో వారికి అడ్మిషన్ ఇచ్చేలా కార్యచరణ రూపొందించారు. ట్రైబల్ ఏరియాలో ఉన్న అన్ని హాస్పిటల్స్‌లో బర్త్ వెయిటింగ్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక 108లు వెళ్లలేని ప్రాంతాల్లో బైక్ అంబులెన్స్‌లను రెడీ చేస్తున్నారు. ప్రతి గ్రామం లేదా ఆవాసంలో ఆసక్తి ఉన్న కనీసం ఇద్దరిని గుర్తించి వారికి ప్రథమ చికిత్స, ఇతర అవసరమైన విషయాల్లో శిక్షణ ఇవ్వనున్నది. గిరిజన, ఆదివాసీ లాంగ్వేజ్ లు మాట్లాడే వారిని అన్ని ఆసుపత్రుల ప్రత్యేక వార్డుల్లో నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా గురువారం హెల్త్ అండ్ ట్రైబల్ వేల్ఫేర్, ఐటీడీఏ పీవోలతో రివ్యూ నిర్వహించారు.