మాతో టచ్ లో 26 మంది ఎమ్మెల్యేలు!.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
మాతో 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే అడిగితే స్మార్ట్ సిటీల గడువు పొడిగించలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మాతో 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే అడిగితే స్మార్ట్ సిటీల గడువు పొడిగించలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ అభివృద్ది కోసం ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నామని, కరీంనగర్ కి ట్రిపుల్ ఐటీ లాంటి విద్యాసంస్థల కోసం ప్రయత్నం చేస్తానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సీటీల గడువు పెంచిందని, దీంతో కరీంనగర్ కి మరిన్ని నిధులు వస్తాయని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే అడగడం వల్ల స్మార్ట్ సిటీల గడువు పెంచలేదు అని, ఇతర రాష్టాల ముఖ్యమంత్రుల కూడా స్మార్ట్ సిటీల గడుపు పెంపు కోసం అడిగారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కేంద్ర నిధులతో పలు ఆలయాలు అభివృద్ది చేసుకోవచ్చని, వేములవాడ ,కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వేములవాడ ఆలయాన్ని ఈసారి ప్రసాదం స్కీంలో చేర్చుతామని, రామాయణ సర్క్యూట్ కింద ఇళ్లందకుంట, కొండగట్టు దేవస్థానాలను చేర్చాలనే ప్రతిపాదన ఉందని తెలిపారు. కరీంనగర్ హాసన్ పర్తి రైల్వే లైన్ సర్వే ఇప్పటికే పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి పై మాట్లాడుతూ.. బీజేపీ చీఫ్ పదవి కోసం ఇంకా అభిప్రాయ సేకరణ జరగలేదని.. త్వరలో పార్టీ ప్రెసిడెంట్ ని అధిష్టానం ప్రకటిస్తుందన్నారు. ఇక తెలంగాణ లో 26 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు. కానీ బీజేపీ లో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉండటంతో వాళ్లు తర్జనభర్జన అవుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అక్రమాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే.. బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న కేకే లాంటి వాళ్లని కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.