ఆధార్ లింకేజీతో అయోమయం.. తెలంగాణలో నిలిచిన 25 వేల రిజిస్ట్రేషన్లు

రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల నిలిచిపోయాయి. వ్యవసాయ, వ్యవసాయేతర క్రియ విక్రయాలకు అంతరాయం ఏర్పడింది.

Update: 2024-07-11 14:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల నిలిచిపోయాయి. వ్యవసాయ, వ్యవసాయేతర క్రియ విక్రయాలకు అంతరాయం ఏర్పడింది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వర్ డౌన్ అని చెప్పారు. పోతే ఆధార్ నంబర్ లింక్ చేయడంలో సమస్యలు తలెత్తాయి. ఫొటోలో ఆధార్ మ్యాచ్ కాకపోవడంతో, నెంబర్ ఇచ్చినా ఓటీపీ రాకపోవడం, ఓటీపీ వచ్చినా వెబ్‌సైట్‌లో అప్లోడ్ కాకపోవడం వంటి ఇష్యూస్ తలెత్తాయి. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసే వారికి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉదయిం 10:30 నుంచి అదే సమస్య తలెత్తింది. అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. యూపీడీఏఐ టీం నుంచి అధికారులకు సరైన సమాచారం అందలేదు. దాంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారికి ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడ్డారు. తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. కొన్ని మండలాల్లో మంగళ, బుధవారాల్లో పెండింగ్ పెట్టిన సేల్ డీడ్స్‌కు సంబంధించిన వారు కూడా వచ్చారు. దాంతో జనాల సంఖ్య పెరిగింది.

25 వేల డాక్యుమెంట్లు పెండింగ్

రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి సంబంధించి 10 వేలు, వ్యవసాయేతర డాక్యుమెంట్లు 15 వేలు పెండింగ్ పడ్డాయి. కేవలం ఆధార్ నెంబర్ లింక్ కాకపోవడంతో కొనుగోలుదారులు అయోమయానికి గురయ్యారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు మరోరోజు ఉద్యోగాలకు సెలవు పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో 25 వేల డాక్యుమెంట్లు అంటే కొనుగోలుదారు, అమ్మకందారు, ఇద్దరు సాక్షులతో కలిపి లక్షమంది ఉదయం నుంచి సాయంత్రం దాకా పడిగాపులు కాశారు. పోతే అమ్మేవారికి పూర్తి డబ్బులు ముట్టాయి. మరోవైపు రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో కొనేవారు భయపడ్డారు. మరోరోజు రిజిస్ట్రేషన్‌కు ఆహ్వానించాల్సి వస్తుంది. ప్రభుత్వానికి మాత్రం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు ముందే అందాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపంతో లక్ష మంది ఇబ్బంది పడ్డారు.


Similar News