‘రోజూ కొడుతున్నాడు.. మా నాన్న నాకొద్దు’.. పోలీస్‌స్టేషన్‌లో 12 ఏళ్ల బాలిక కన్నీటి ఆవేదన

మా నాన్న నాకొద్దంటూ ఓ 12 ఏళ్ల బాలిక పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఘటన జగిత్యాల (Jagityal)లో చోటు చేసుకుంది.

Update: 2024-10-01 05:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: మా నాన్న నాకొద్దంటూ ఓ 12 ఏళ్ల బాలిక పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఘటన జగిత్యాల (Jagityal)లో చోటు చేసుకుంది. తన తండ్రి తనని ఎప్పుడూ కొడుతున్నాడని, తను ఇంట్లో ఉండడని, హాస్టల్లోనే ఉంటానని వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె (Sriramulu)కు చెందిన బాలిక తల్లి కొంతకాలం క్రితం మరణించింది. దీంతో ఆమె తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను తీసుకెళ్లి హాస్టల్లో చేర్చాడు. ఏడో తరగతి చదువుతున్న బాలికను మొదట బాలసదనం, ఆనంద నిలయంలో చేర్పించాడు. ఆ తర్వాత కేజీబీవీలో చేర్పించాడు. కానీ తల్లి లేని బిడ్డ ఒంటరిగా ఉండలేక తిరిగి ఇంటికి చేరింది. ఈ క్రమంలోనే తండ్రి కొడుతుండడంతో 5 రోజుల కింద ఇంటి నుంచి వెళ్లిపోయింది.

ఇంటి నుంచి వెళ్లిన ఆమెని వేములవాడలో గుర్తించి సిరిసిల్ల సఖీ కేంద్రంలో చేర్పించగా.. అక్కడి నుంచి డీసీపీవో ఆఫీసర్లు తండ్రికి అప్పగించారు. అయితే సఖీ కేంద్రం (Sakhi Centre) నుంచి రాగానే తండ్రి మళ్లీ కొట్టడంతో చుట్టుపక్కల వారు గమనించి ఆపారు. ఈ క్రమంలోనే జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాలిక.. “మా నాన్న ఎప్పుడూ కొడుతున్నాడు..నాకు నాన్న వద్దు.. నేను హాస్టల్‌లోనే ఉంటా..” అంటూ పోలీసుల ముందు కన్నీళ్లు పెట్టుకుంది. తల్లి ప్రేమకు నోచుకోని బాలిక ఆవేదన విని పోలీసుల (Police) మనసు కూడా ద్రవించిపోయింది. పట్టణ సీఐ వేణు సమాచారంతో సదరు బాలికను జగిత్యాల డీసీపీవో సిబ్బంది సఖీ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం బాలిక సఖీ కేంద్రంలో ఉంది.


Similar News